
ఆసియా కప్ - 2022 ఫైనల్‌లో శ్రీలంక చేతిలో పాక్ ఓడిపోయిన తర్వాత.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ (పీసీబీ) చైర్మన్ రమీజ్ రాజా ఓ భారత జర్నలిస్టుతో సీరియస్ అయ్యాడు. దుబాయ్ స్టేడియం వెలుపల జర్నలిస్ట్ అడిగిన ఓ క్వశ్చన్‌తో ఫైర్ అయిన రమీజ్ చాలా కటువుగా ప్రవర్తించాడు. ఆసియా కప్ 2022 ఫైనల్‌లో పాక్ ఓడిపోయిన తర్వాత పాకిస్థాన్ ప్రేక్షకులు నిరాశ చెంది ఉంటారు.. కదా వాళ్ల గురించి మీరు ఏం చెబుతారు అని అడగ్గా రమీజ్ తన ప్రశాంతతను కోల్పోయాడు. 'ఓటమి వల్ల పాకిస్థాన్ ప్రజలు చాలా విచారంగా ఉన్నారు, మీరు వారికి ఏమి సందేశం ఇస్తారు?' అని భారతీయ జర్నలిస్ట్ అడిగాడు.
రమీజ్ రాజా బదులిస్తూ, 'ఆప్ ఇండియా సే హోంగే? ఆప్ తో బడే ఖుష్ హోంగే? (మీరు భారతదేశానికి చెందినవారా? అప్పుడు మీరు చాలా సంతోషంగా ఉండాలి?)". అన్నాడు. మీరు ఇండియా జర్నలిస్టు కదా.. మీరు మాత్రం ఖుషీ అయి ఉంటారులే అన్నట్లు ఎద్దేవా చేస్తూ మాట్లాడాడు.
ఆ తర్వాత సదరు జర్నలిస్టు మొబైల్ ఫోన్ కూడా రజా లాక్కున్నాడు. అయితే వెంటనే దాన్ని మళ్లీ ఇచ్చేశాడు. ఇకపోతే ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను సదరు జర్నలిస్టు ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. తను అడిగిన ప్రశ్నలో తప్పు ఏమైనా ఉందా అంటూ ట్వీట్లో పేర్కొన్నాడు. క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగా ఉన్న రజా లాంటి వ్యక్తి అలా ఫోన్ లాక్కోవడం కరెక్టేనా అని ప్రశ్నించాడు. రమీజ్ రియాక్షన్‌కు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరలవుతుంది.
ఆసియా కప్ 2022 ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచినప్పటికీ పాకిస్థాన్ ఓడిపోయింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక ఆరోసారి ఆసియా కప్‌ను కైవసం చేసుకుంది. భానుక రాజపక్సే బ్యాటింగ్ మాస్టర్‌క్లాస్, వనిందు హసరంగ ఆల్ రౌండ్ ప్రదర్శనతో పాకిస్తాన్‌పై శ్రీలంక 23పరుగుల తేడాతో విజయం సాధించింది. ఓటమి అనంతరం బ్యాటింగ్, ఫీల్డింగ్ విభాగంలో తమ జట్టు ప్రదర్శనను పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ తప్పుపట్టిన సంగతి తెలిసిందే.