ఆసియా కప్ 2025లో భాగంగా పాకిస్థాన్, భారత్ మధ్య జరిగిన మ్యాచ్ తర్వాత షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడంపై జరిగిన వివాదం అనంతరం మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ను తొలగించాలని పీసీబీ చేసిన డిమాండ్ పాక్ క్రికెట్లో పెద్ద దుమారాన్నే రేపుతోంది. ఈ వివాదంపై పీసీబీ మాజీ ఛైర్మన్ రమీజ్ రాజా కూడా స్పందించి బీసీసీఐపై ఆరోపణలు చేశారు. అయితే ఆయనే గతంలో భారత్ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రమీజ్ రాజా గతంలో చేసిన వ్యాఖ్యలు వైరల్
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(PCB) ఛైర్మన్ గా ఉన్న సమయంలో రమీజ్ రాజా భారత్‌ను ప్రశంసించారు. 2021లో రమీజ్ రాజా మాట్లాడుతూ.. "ఐసీసీ ఒక రాజకీయ సంస్థ. ఐసీసీ ఆదాయంలో 90 శాతం భారత్ నుంచే వస్తుంది. పీసీబీకి వచ్చే నిధుల్లో 50 శాతం ఐసీసీ నుంచే వస్తుంది. భారత్‌లోని వ్యాపార సంస్థలే పాకిస్థాన్ క్రికెట్‌ను నడుపుతున్నాయి. రేపు భారత ప్రధాని ఒక నిర్ణయం తీసుకుని పాకిస్థాన్‌కు ఎటువంటి నిధులు ఇవ్వకుండా ఆపేస్తే, ఈ క్రికెట్ బోర్డు కుప్పకూలిపోతుంది" అని రమీజ్ రాజా చెప్పారు.

అయితే ఇప్పుడు అదే రమీజ్ రాజా బీసీసీఐని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారు. భారత్-పాక్ మ్యాచ్ అనంతరం జరిగిన వివాదానికి పైక్రాఫ్ట్ కారణమని ఆరోపించారు. ఒకప్పుడు భారత క్రికెట్ శక్తిని పొగిడిన ఆయన ఇప్పుడు మాట మార్చడంపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
వివాదం తర్వాత మళ్లీ ఇండియాతో మ్యాచ్
మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ను తొలగించాలనే పీసీబీ డిమాండ్ ను ఐసీసీ పట్టించుకోలేదు. ఈ క్రమంలో పాకిస్థాన్ జట్టు యూఏఈతో మ్యాచ్ ఆడి, కష్టపడి గెలిచి సూపర్-4కు చేరింది. ఈ విజయంతో సెప్టెంబర్ 21 దుబాయ్‌లో మళ్లీ భారత్‌తో తలపడనుంది. ఓ వైపు మ్యాచ్‌లకు ముందు వివాదాలు.. మరోవైపు పాక్ జట్టు ఆటతీరుపై ప్రశ్నలు ఉన్నప్పటికీ.. ఈ మొత్తం డ్రామా చివరకు ఇరు జట్ల మధ్య మరో రసవత్తరమైన పోరుకు దారి తీసింది.