
కరాచీ: పాకిస్థాన్ మాజీ క్రికెటర్, స్టార్ కామెంటేటర్ రమీజ్ రాజా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ పదవిని చేపట్టేందుకు సర్వం సిద్ధమైంది. సోమవారం (సెప్టెంబర్ 13) జరగనున్న బోర్డ్ ఆఫ్ గవర్నర్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటి వరకు పీసీబీ చైర్మన్ స్థానంలో కొనసాగిన ఎహసాన్ మణి మూడేళ్ల పదవీ కాలం ఆగస్టు 25తో పూర్తయింది. దాంతో ఆయన ఆ పదవి నుంచి తప్పుకున్నారు. ఎహసాన్ మణి తన పదవి కాలంలో పీసీబీని సరైన మార్గంలోనే నడిపించారు. అయితే కోచ్‌ల విషయంలో మాత్రం ఆయన కాస్త అజాగ్రత్తగా వ్యవరించినట్టు వార్తలు వెలుబడ్డాయి.
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఎలక్షన్ కమిషనర్ జస్టిస్ (రిటైర్డ్) షేక్ అజ్మత్ సయీద్ సోమవారం ఎలక్షన్ నిర్వహిస్తారు. అదే సమయంలో ప్రత్యేక సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. బోర్డులో పార్టన్ ఇన్ చీఫ్ అయిన పాక్ ప్రధాని, మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ కూడా బోర్డ్ ఆఫ్ గవర్నర్ కొత్త సభ్యుల కోసం రమీజ్ రాజా, సీనియర్ బ్యూరోక్రాట్ అసద్ అలీ ఖాన్ పేర్లను ప్రతిపాదించారు. రమీజ్ రాజా వైపే ఆయన మొగ్గుచూపుతున్నారని సమాచారం. దాంతో పీసీబీ చైర్మన్‌గా రమీజ్ రాజా ఎన్నిక దాదాపు ఖాయమైనట్టేనని తెలుస్తోంది. సమావేశం ముగిసిన వెంటనే కొత్త చైర్మన్ మీడియాతో మాట్లాడతారని పీసీబీ పేర్కొంది.
టీ20 ప్రపంచకప్ 2021కు ముందు పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు భారీ షాక్ తగిలిన విషయం తెలిసిందే. పాక్ క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్‌గా ఉన్న మిస్సా ఉల్ హక్, బౌలింగ్ కోచ్‌గా ఉన్న వకార్ యూనిస్‌లు తమతమ పదవులకు రాజీనామా చేశారు. అక్టోబర్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు 15 మందితో కూడిన జట్టును పీసీబీ వెల్లడించిన సరిగ్గా రెండు గంటల అనంతరం ఇద్దరు కోచ్‌లు రాజీమానా చేసి భారీ షాక్ ఇచ్చారు. ఇక న్యూజిలాండ్‌తో త్వరలో జరిగే సిరీస్‌లకు తాత్కాలిక కోచ్‌లుగా సక్లెయిన్ ముస్తాక్, అబ్దుల్ రజాక్‌లను పీసీబీ నియమించింది. కొత్త చైర్మన్ వచ్చాక కోచ్‌లను కూడా నియమిస్తారని సమాచారం.
టీ20 ప్రపంచకప్‌కు 15 మందితో కూడిన జట్టును పీసీబీ ప్రకటించగా.. బాబర్ అజమ్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈ జట్టులో ఐదుగురు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్, ఇద్దరు వికెట్ కీపర్స్, నలుగురు ఆల్‌రౌండర్స్, నలుగురు ఫాస్ట్ బౌలర్స్ ఎంపికయ్యారు. కాగా ఫఖర్ జమన్, ఉస్మాన్ ఖాదీర్, షాహనవాజ్ దహానిలను రిజర్వ్ ఆటగాళ్లుగా ఉన్నారు. పాక్ సీనియర్ ఆల్‌రౌండర్ షోయబ్ మాలిక్, మరో సీనియర్ బ్యాట్స్‌మన్ సర్ఫరాజ్ అహ్మద్‌లకు చోటు దక్కలేదు. ఆల్‌రౌండర్ షార్జీల్ ఖాన్‌కు కూడా ప్రాబబుల్స్‌లో చోటు దక్కలేదు. ఇక యువ ఆటగాడు అజమ్ ఖాన్ తుది జట్టులో చోటు దక్కించుకోగా.. ఆసిఫ్ అలీ, కుష్‌దిల్ షా లాంటి కొత్త ప్లేయర్స్ జట్టులోకి వచ్చారు. టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్, భారత్ ఒకే గ్రూఫ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 24న ఇరు జట్లు తలపడనున్నాయి.
పాకిస్తాన్ టీ20 జట్టు ఇదే
బాబర్ అజమ్ (కెప్టెన్), షాదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), మహ్మద్ హఫీజ్, ఆసిఫ్ అలీ, అజమ్ ఖాన్, హారిస్ రౌఫ్, హసన్ అలీ, ఇమాద్ వసీం, ఖుష్దీల్ షా, మొహమ్మద్ హస్నైన్, మహ్మద్ నవాజ్, మహమ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), మొహమ్మద్ వసీం, షాహిన్ అఫ్రిది, సోహైబ్ మక్సూద్.