'ఫిక్సింగ్‌కు పాల్పడ్డ క్రికెటర్లపై జీవితకాల నిషేధం విధించాలి'

కరాచి: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)లో మళ్లీ మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం రేగిన విషయం తెలిసిందే. ఈ ఫిక్సింగ్ భూతంపై పాక్ మాజీ కెప్టెన్ రమీజ్ రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతికి పాల్పడ్డ క్రికెటర్లపై జీవితకాల నిషేధం విధించేలా పార్లమెంట్‌లో చట్టం చేయాలని ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను కోరారు. పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్)లో స్పాట్ ఫిక్సింగ్ చేయాలని తనను సంప్రదించిన విషయం పీసీబీకి చెప్పకుండా సీనియర్ క్రికెటర్ ఉమర్ అక్మల్ దాచడంతో అతనిపై గురువారం పీసీబీ సస్పెన్షన్ వేటు వేసింది.

పార్లమెంట్‌లో చట్టాలు చేయాలి:
ఫిక్సింగ్ భూతంపై రమీజ్ రాజా మాట్లాడుతూ... 'షర్జీల్ ఖాన్, ఖలీద్ లతీఫ్ ఉదంతం నిన్ననే చోటు చేసుకున్నట్టుంది. అప్పుడే మరోటి బయటకు వచ్చింది. పాకిస్థాన్ క్రికెట్లో పదేపదే ఇలా జరగడం నన్ను ఆగ్రహానికి గురిచేస్తుంది. ఫిక్సింగ్ చేసిన ఆటగాళ్లను కఠినంగా శిక్షించేందుకు పార్లమెంట్‌లో చట్టాలు చేయాలి. న్యూజిలాండ్ సహా మరొకొన్ని దేశాల్లో తప్పు చేసిన ఆటగాళ్లు పునరాగమనం చేయకుండా చట్టాలు ఉన్నాయి. సాంకేతికత ఎంతో పెరిగింది. అవినీతిని సులువుగా గుర్తించొచ్చు' అని అన్నారు.

ఆర్థిక సమాచారాన్ని సేకరించాలి:
సల్మాన్ బట్, మహ్మద్ అమీర్, మహ్మద్ ఆసిఫ్‌లు తమ స్పాట్ ఫిక్సింగ్ నిషేధం అనంతరం తిరిగి క్రికెట్‌లోకి అనుమతించడాన్ని వ్యతిరేకిస్తూ 57 ఏళ్ల వ్యాఖ్యాత అసహనం వ్యక్తం చేసారు. 'పాకిస్థాన్ ప్రజలను ఏకతాటిపై తెచ్చే అంశాల్లో క్రికెట్ కూడా ఒకటి. దానిని నాశనం చేసేలా ఎవరినీ అనుమతించొద్దు. ఆటగాళ్లు, అధికారుల కుటుంబీకుల ఆర్థిక సమాచారాన్ని పీసీబీ సేకరించాలి. అప్పుడే ఏం జరుగుతుందో సులువుగా గుర్తించవచ్చు' అని రమీజ్ పేర్కొన్నారు.

పాక్ ఆటగాళ్లకు ఏమైందో:
'పాక్ ఆటగాళ్లకు ఏమైందో నాకు అర్ధం కావట్లేదు. జీతాలు బాగానే వస్తున్నప్పటికీ సంతృప్తి చెందడం లేదు. మా రోజుల్లో ఇలాంటి అవినీతి ప్రతిపాదలను తిరస్కరించాం. తనను సంప్రదించిన విషయాన్ని అక్మల్ వెంటనే అధికారులకు తెలియజేయాల్సి ఉండే' అని మాజీ టెస్ట్ ఓపెనర్ మొహ్సిన్ ఖాన్ చెప్పుకొచ్చారు. ఉమర్ అక్మల్ సంఘటనపై చాలా నిరాశ చెందానని ఖాన్ అన్నారు.

అక్మల్‌పై విచారణ:
ఉమర్ అక్మల్‌పై సస్పెన్షన్ వెంటనే అమలులోకి రానుందని గురువారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పీసీబీ తెలిపింది. అక్మల్‌పై జరుగుతున్న విచారణ పూర్తయ్యే వరకు పాకిస్థాన్ క్రికెట్‌కు సంబంధించిన ఏ కార్యకలాపాల్లోనూ పాల్గొనకూడదంటూ బోర్డు అతన్ని ఆదేశించింది. ఈ విషయమై ఇంతకు మించి వివరాలను ప్రకటించేందుకు పీసీబీ నిరాకరించింది. మ్యాచ్ ఫిక్సింగ్ అంశాన్ని అక్మల్ తాజాగా బయటపెట్టాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications