హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి 'ఏ' గ్రేడ్ ఎలా కేటాయించారంటూ బీసీసీఐని పాక్ మాజీ ఆటగాడు రమీజ్ రాజా ప్రశ్నించాడు. ధోని టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికినప్పటికీ అతడిని బీసీసీఐ ఏ గ్రేడ్‌లో కొనసాగించడం ఎంత మాత్రం కరెక్ట్ కాదని అభిప్రాయపడ్డాడు.
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సైతం టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన షాహిద్ అప్రీదికి ఏ గ్రేడ్‌ను కట్టబెట్టిందని ఇది టెస్టు ఫార్మెట్‌కే ముప్పు అని పేర్కొన్నాడు. టెస్టుల నుంచి రిటైర్మెంట్ అయిన తర్వాత ఈ ఇద్దరి మాజీ కెప్టెన్లకు ఏ గ్రేడ్ ఇవ్వడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని అన్నాడు.

ఆసియా క్రికెట్ బోర్డులు టెస్టు ఫార్మెట్‌కు గౌరవం ఇవ్వాలని రమీజ్ రాజా సూచించాడు. అంతేకాదు ఆసియా క్రికెట్ బోర్డులు టెస్టు క్రికెట్‌ను కాపాడేందుకు సరైన ప్రణాళికలను రూపొందించాలని, ముఖ్యంగా ట్వంటీ20ల నుంచి టెస్టు ఫార్మెట్‌ను కాపాడాలని పేర్కొన్నాడు.
బోర్డులపై ఒత్తిడి ఉండటం సహజమే కానీ టెస్టు చాంపియన్ షిప్ నిర్వహించాలని సూచించాడు. క్యాష్ రిచ్ టీ20 లీగ్‌లతో టెస్టులకు ముప్పు వాటిల్లిందని రమీజ్ రాజా ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా, అంతకముందు క్రికెట్ పాలనా కమిటీలో సభ్యుడిగా ఉన్న రామచంద్ర గుహా సైతం ధోనికి ఏ గ్రేడ్ కేటాయించడాన్ని తప్పు బట్టిన విషయం తెలిసిందే.