హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి 'ఏ' గ్రేడ్ ఎలా కేటాయించారంటూ బీసీసీఐని ప్రశ్నించిన పాక్ మాజీ క్రికెటర్ రమీజ్ రాజాపై సోషల్ మీడియాలో నెటిజన్లు జోకులు పేల్చుకున్నారు. వివరాల్లోకి వెళితే... ధోని టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికినప్పటికీ అతడిని బీసీసీఐ ఏ గ్రేడ్‌లో కొనసాగించడం ఎంత మాత్రం కరెక్ట్ కాదని ఆయన విమర్శించాడు.
టెస్టుల నుంచి రిటైర్మెంట్ అయిన తర్వాత ఈ ఇద్దరి మాజీ కెప్టెన్లకు ఏ గ్రేడ్ ఇవ్వడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని, ఆసియా క్రికెట్ బోర్డులు టెస్టు ఫార్మెట్‌కు గౌరవం ఇవ్వాలని రమీజ్ రాజా సూచించిన సంగతి తెలిసిందే. ఆసియా క్రికెట్ బోర్డులు టెస్టు క్రికెట్‌ను కాపాడేందుకు సరైన ప్రణాళికలను రూపొందించాలని, ముఖ్యంగా ట్వంటీ20ల నుంచి టెస్టు ఫార్మెట్‌ను కాపాడాలని పేర్కొన్నాడు.

బోర్డులపై ఒత్తిడి ఉండటం సహజమే కానీ టెస్టు చాంపియన్ షిప్ నిర్వహించాలని సూచించాడు. క్యాష్ రిచ్ టీ20 లీగ్‌లతో టెస్టులకు ముప్పు వాటిల్లిందని రమీజ్ రాజా ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో రమీజ్ రాజాపై భారత క్రీడాభిమానులు తీవ్రంగా స్పందిస్తున్నారు.
"ముందు పాకిస్థాన్ క్రికెట్ గురించి పట్టించుకోండి. పాక్ క్రికెట్ జట్టు ఎందుకు వెనుకబడిందో ఇప్పుడు నాకు తెలిసింది. సీనియర్లు ఇతర దేశాల క్రికెటర్ల గురించి ఆలోచిస్తున్నారు కాబట్టే" అని ఓ అభిమాని వ్యాఖ్యానించాడు.
"ముందు పీసీబీ గురించి ఆలోచించండి. ఆ తరువాత మా బీసీసీఐని ప్రశ్నిద్దురు గాని. అసలు నువ్వు కామెంటేటరువేనా?" అని మరొక అభిమాని రమీజ్ రాజాపై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.
"ధోనీకి ఏ గ్రేడ్ కాంట్రాక్టు ఇస్తే, నీకెందుకు బాధ... మీలాంటి వారి వైఖరి వల్లే పాక్ క్రికెట్ ఇలా ఏడుస్తోంది" అని మరొకరు వ్యాఖ్యానించారు.
పబ్లిసిటీ కోసమే రమీజ్ రాజా ఇలా చౌకబారు విమర్శలు చేస్తున్నాడని, మరోసారి ఇండియా వస్తే, భారత అభిమానుల నుంచి నిరసనలు ఎదుర్కోక తప్పదని నెటిజన్లు హెచ్చరికలు జారీ చేశారు.
2060 వరకూ పాక్ క్రికెట్ జట్టు ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ విజయోత్సవాలు జరుపుకుంటూనే ఉండి పోతుందని, అసలు బీసీసీఐ గురించి ప్రశ్నించే హక్కు నీకు ఎక్కడిదని ఇలా రమీజ్ రాజాపై భారత క్రికెట్ అభిమానులు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.