పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ రమీజ్ రాజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌తో కూడిన నాలుగు జట్ల టీ20ఐ సిరీస్‌ను ప్రతి సంవత్సరం నిర్వహించాలని ఇంటర్నేషన్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ముందుకు ఓ ప్రతిపాదనను తీసుకురానున్నట్లు వెల్లడించారు. ఈ సిరీస్‌కు రోటేషన్ పద్దతిలో ఒక్కో సంవత్సరం ఒక్కో దేశం అతిథ్యం ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. అలాగే ఈ సిరీస్ జరిగితే వచ్చే లాభాలను నాలుగు జట్లు పంచుకోవాలని చెప్పారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. అయితే రమీజ్ రాజా ప్రతిపాదనపై అభిమానుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రమీజ్ రాజా ప్రతిపాదనపై ఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. రమీజ్ రాజా ప్రతిపాదనపై భారత క్రికెట్ బోర్డు బీసీసీఐ, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఇప్పటివరకు స్పందించలేదు. అంతేకాకుండా ఈ టీ20ఐ సిరీస్ ప్రతిపాదనపై భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియానే కాకుండా మిగతా జట్లు కూడా ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. దీంతో పీసీబీ చైర్మన్ ప్రతిపాదనపై మిగతా జట్లతోపాటు ఐసీసీ ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
Hello fans.Will propose to the ICC a Four Nations T20i Super Series involving Pak Ind Aus Eng to be played every year,to be hosted on rotation basis by these four. A separate revenue model with profits to be shared on percentage basis with all ICC members, think we have a winner.
— Ramiz Raja (@iramizraja) January 11, 2022
కాగా గత ఏడాది టీ20 వరల్డ్‌కప్‌లో టీమిండియాపై పాకిస్థాన్ 10 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తద్వారా ప్రపంచకప్ టోర్నమెంట్లలో భారత్‌పై ఆ జట్టు తొలి సారి విజయం నమోదు చేసింది. ఆ తర్వాత ఇరు జట్లు మళ్లీ ఇప్పట్లో తలపడే అవకాశం లేదు. గతంలో భారత్, పాకిస్థాన్ మధ్య వరుసగా సిరీస్‌లు జరిగేవి. కానీ ఇరు దేశాల సరిహద్దుల్లో తరచూ నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రస్తుతం ఇరు జట్ల మధ్య ఎలాంటి సిరీస్‌లు జరగడం లేదు. కేవలం ఐసీసీ నిర్వహించే టోర్నీలలోనే భారత్, పాకిస్థాన్ తలపడుతున్నాయి. భారత జట్టుతో సిరీస్‌లు ఆడడానికి పాకిస్థాన్ పలు మార్లు ప్రయత్నించినప్పటికీ అది సాధ్యపడలేదు.
ప్రస్తుతం భారత జట్టు సౌతాఫ్రికా పర్యటనలో బిజీగా ఉంది. అక్కడ మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇప్పటివరకు ముగిసిన రెండు మ్యాచ్‌లను ఇరు జట్లు చెరోటి గెలిచాయి. దీంతో కేప్‌టౌన్ వేదికగా మంగళవారం ప్రారంభమైన మూడో టెస్టు మ్యాచ్ సిరీస్ విజేతను తేల్చనుంది. అయితే ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ తొలి రోజు ఆటలో తడబడింది. సఫారీ బౌలర్ల ధాటికి 223 పరుగులకే ఆలౌట్ అయింది. భారత జట్టు బ్యాటర్లలో కెప్టెన్ విరాట్ కోహ్లీ మినహా ఎవరూ రాణించలేకపోయారు. కోహ్లీ మాత్రమే 79 పరుగులతో సత్తా చాటాడు.