
హైదరాబాద్: ప్రస్తుతం భారత్‌లో బయోపిక్‌ల హవా నడుస్తోంది. ఈ బయోపిక్‌ల్లో ఎక్కువగా క్రీడాకారులవే ఉండటం విశేషం. ఇప్పటికే విడుదలైన మిల్కా సింగ్, సచిన్, ధోనీ, అజహర్‌లపై వచ్చిన బయోపిక్‌లు అభిమానులను ఆకట్టుకున్నాయి. త్వరలో మాజీ క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ బయోపిక్ వస్తోంది.
ఈ సినిమాకు 83గా పేరు పెట్టారు. మరోవైపు భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ బయోపిక్‌లో పరిణీతి చోప్రా నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది. భారత మహిళా వన్డే జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ బయోపిక్‌లో బాలీవుడ్ నటి తాస్పీ పొన్ను నటించనుంది. రెండు రోజుల క్రితం ఇందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఇదిలా ఉంటే, బాలీవుడ్ దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణీ భారత్ తరఫున టెస్టుల్లో తొలి సెంచరీ సాధించిన 'లాలా అమర్‌నాథ్' బయోపిక్ తీయనున్నట్లు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. బాలీవుడ్ ఫిలిం క్రిటిక్ తరణ్ ఆదర్శ్ సైతం ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా ధ్రువీకరించారు.
రాజ్ కుమార్ హిరాణి విషయానికి వస్తే బాలీవుడ్‌లో 'మున్నాభాయ్ ఎంబీబీఎస్', 'లగేరహో మున్నాభాయ్', 'త్రీ ఇడియట్స్', 'పీకే' వంటి హిట్ సినిమాలకు దర్శకత్వం వహించారు. పంజాబ్‌లోని కపుర్తలలో జన్మించిన లాలా అమర్‌నాథ్ భారత క్రికెట్ చరిత్రలో తన పేరుని ఓ అరుదైన రికార్డుతో లిఖించుకున్నాడు.
అదేంటంటే భారత్ తరుపున టెస్టుల్లో తొలి సెంచరీ సాధించింది ఆయనే కాబట్టి. 1933లో ఇంగ్లాండ్‌పై తొలి టెస్టు మ్యాచ్ ఆడిన ఆయన 1955లో పాక్‌పై తన ఆఖరి టెస్టు మ్యాచ్ ఆడాడు. అంతేకాదు 1947-48లో ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియాకు కెప్టెన్‌గా కూడా వ్యవహారించాడు. భారత్ తరుపున 24 టెస్టులాడి 878 పరుగులు చేశాడు.
ఇందులో ఒక సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక, 184 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లాడి 10,426 పరుగులు చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 3 సార్లు 10 వికెట్లు తీశాడు. ఆయన ఇద్దరు కుమారులు సురిందర్, మొహిందర్ అమర్‌నాథ్. వీరిద్దరూ కూడా క్రికెటర్లే కావడం విశేషం. 1983లో టీమిండియా తొలి వన్డే వరల్డ్ కప్ గెలిచిన జట్టులో మొహిందర్ అమర్‌నాథ్ సభ్యుడు కూడా.