రాజ్‌కోట్: సెలబ్రిటీ ఫైరింగ్ సాధారణమేనని పోలీసులు చెబుతున్నారు. క్రికెటర్ రవీంద్ర జడెజా పెళ్లి సందర్భంగా రెండు రోజుల క్రితం ఓ బంధువు గాల్లోకి కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. దీనిపై గుజరాత్ డిజిపి పిపి పాండే సోమవారం నాడు మాట్లాడారు.
సాధారణంగా కొన్ని పెళ్లిళ్లలో అంతకంటే ఎక్కువనే ఫైరింగ్ జరుపుతారని చెప్పారు. నేను ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందినవాడినని, అక్కడ ప్రతి పెళ్లిలో వంద నుంచి రెండు వందల రౌండ్ల ఫైరింగ్ జరుగుతుందని చెప్పారు.
మరోవైపు, ఫైరింగ్ పైన రాజ్‌కోట్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. రాజ్‌కోట్ పోలీసులు మాట్లాడుతూ... ఇది హోటల్ లోపల జరిగింది చెప్పారు. ఫైరింగ్‌కు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో హల్‌చల్ చేస్తోంది. అందులో ఓ వ్యక్తి కాల్పులు జరుపుతూ కనిపిస్తాడు.

కాగా, భారత స్టార్ క్రికెటర్ రవీంద్ర జడేజా పెళ్లి కార్యక్రమంలో ఆదివారం నాడు వివాదాస్పద సంఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లి వేడుకలు జరుగుతుండగా కొందరు వక్తులు తుపాకితో గాల్లోకి కాల్పులు జరిపారు. పెళ్లి వేడుకల్లో భాగంగా జరిగిన ఊరేగింపులో పెళ్లి కూతురుకి దగ్గరగా కాల్పులు జరిపారు.
కాల్పులు జరిపిన వ్యక్తి జడెజా దూరపు బంధువుగా తెలుస్తోంది. కాల్పులు జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఘటనకు సంబంధించిన వీడియో పుటేజీని పరిశీలించారు. ఫుటేజీలో కాల్పులు జరిపినట్లుగా కనిపించింది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు.