ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటీదార్ చరిత్ర సృష్టించాడు. వాంఖెడె స్టేడియం వేదికగా జరిగిన మ్యాచులో ముంబయి ఇండియన్స్ పై 12 పరుగుల తేడాతో తమ జట్టును గెలిపించుకుని ఓ అరుదైన ఘనత సాధించాడు. ఈ సీజన్ లో ఆర్సీబీ నాలుగు మ్యాచులు ఆడగా.. అందులో హ్యాట్రిక్ (ఆతిథ్య జట్టుపై) విజయాలను నమోదు చేసింది.
మొదటగా ఈడెన్ గార్డెన్స్‌లో KKRపై, చెపాక్‌లో CSKపై విజయాలతో ప్రారంభించిన ఆర్సీబీ.. ఆ తర్వాత ఇప్పుడు వాంఖెడె స్టేడియంలో ముంబయిపై గెలుపుతో మరో విజయాన్ని నమోదు చేసింది. కేవలం తన మూడో మ్యాచులో అది కూడా సొంత గడ్డపై జరిగిన పోరులో మాత్రమే గుజరాత్ టైటాన్స్ పై ఓడింది.

అప్పుడు అతనొక్కడే సాధించాడు..
ఒకే సీజన్ లో సీఎస్కే, కేకేఆర్, ఎంఐ లాంటి బడా జట్లపై (ఆతిథ్య గ్రౌండ్‌లో) హ్యాట్రిక్ విజయాన్ని సాధించి రజత్ పటీదార్ తన పేరును చరిత్ర పుస్తకాల్లో లిఖించుకున్నాడు. అంతకుముందు ఈ ఫీట్ ను 2012లో కింగ్స్ పంజాబ్ కు సారథ్యం వహించిన డేవిడ్ హుస్సే అందుకున్నాడు. పంజాబ్ జట్టు.. కేకేఆర్, సీఎస్కే, ముంబయి జట్లపై క్లోజ్ మార్జిన్స్ తో(2 పరుగులు,7 పరుగులు, 6 వికెట్లు) గెలుపొందింది. మళ్లీ ఇప్పుడు 13 ఏళ్ల తర్వాత హుస్సే తర్వాత ఈ అరుదైన ఘనత సాధించిన రెండో కెప్టెన్ గా రజత్ పటీదార్ నిలిచాడు. అలానే ఈ మార్క్ టచ్ చేసిన తొలి భారత ఆటగాడిగానూ నిలిచాడు.
మొత్తంగా ఒకే సీజన్ లో ఈ రేర్ హ్యాట్రిక్ విజయాలను ఆర్సీబీ, పంజాబ్ తప్ప మరే ఇతర జట్టు కూడా అందుకోలేదు. పైగా ఎంఐ, సీఎస్కే, కేకేఆర్ ఎక్కువ ట్రోఫీలు అందుకున్న జట్లు మాత్రమే కాదు, ఒకే వేదికపై అత్యధిక విజయాలను నమోదు చేసిన జట్లు కూడా. అలాంటి వాటినే ఇప్పుడు రజత్ పటీదార్ నేతృత్వంలోనే ఆర్సీబీ ఓడించింది.
5,10,17 ఏళ్ల తర్వాత
ఆర్సీబీకి.. 2015 తర్వాత వాంఖెడె స్టేడియంలో ముంబయి ఇండియన్స్‌పై వచ్చిన తొలి గెలుపు ఇదే కావడం విశేషం. అలానే చెపాక్ స్టేడియంలో 17 ఏళ్ల సీఎస్కేపై విజయం సాధించింది. అలానే ఈడెన్ గార్డెన్స్ లో కేకేఆర్ పై 5ఏళ్ల గెలుపును అందుకుంది.