RCB VS RR: ఐపీఎల్ 2025లో ఆర్సీబీ దూకుడు ప్రదర్శన చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే బయట స్టేడియాలో విజయాలు సాధిస్తోన్న ఆ జట్టు.. హోమ్ గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియంలో మాత్రం చేతులెత్తేస్తోంది. ఇప్పటివరకు సొంత మైదానంలో మూడు మ్యాచులు ఆడి ఓడింది. ఒక్క మ్యాచులోనూ విజయం సాధించలేదు. అయితే తాజాగా సొంత మైదానంలో రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచు నేపథ్యంలో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటీదార్ కీలక వ్యాఖ్యలు చేశాడు. హోమ్ స్టేడియంలో ఎందుకు ఓటమిని అందుకుంటున్నారో కారణాన్ని వివరించాడు.
అలా చేస్తేనే మంచి స్కోరు..
"ఈ సీజన్‌లో మా స్టేడియం పిచ్‌లు టూ పేస్డ్ వికెట్స్. చాలా కష్టంగా ఉన్నాయి. ఈ కారణంగానే ఓడిపోతున్నామని కరెక్ట్ గా చెప్పలేను. బౌన్స్ కూడా మారిపోతోంది. అందుకే బౌలర్లకు బాగా కలిసొస్తోంది. కాబట్టి బ్యాటర్లు జాగ్రత్తగా ఆడాలి. బ్యాటర్లు ఆ విషయం గుర్తించి, పిచ్‌కు తగ్గట్టు షాట్ సెలెక్షన్ చేస్తేనే మంచి స్కోరు చేయగలరు. ఇప్పటివరకైతే ఆర్సీబీ గొప్పగానే ప్రదర్శన చేస్తోంది. బయటి స్టేడియాల్లో కీలక విజయాలు సాధించాం. గత మ్యాచుల్లోని తప్పులను నేర్చుకుని ముందుకు సాగాలి. పొరపాట్లను మళ్లీ పునరావృతం చేయకుండా చూసుకోవాలి." అని రజత్ పటీదార్ చెప్పుకొచ్చాడు.
పెద్ద సవాల్ ఉంది..
"మా కెప్టెన్ రజత్ పటీదార్ సింప్లిసిటీ పర్సన్. అతడితో చాలా ప్రశాంతంగా మాట్లాడొచ్చు. డ్రెస్సింగ్‌రూంలో అతడిని చూసి ఎవరూ కెప్టెన్ అనుకోరు. మైదానంలో అడుగుపెట్టినప్పుడు మాత్రమే అతడు కెప్టెన్ అని మనకు తెలుస్తుంది. ఎంత ఒత్తిడిలో ఉన్నా కామ్ గా, సమర్థంగా ఉంటాడు. అన్ని కోణాల నుంచి పరిస్థితులను అంచనా వేయగలడు. కామ్ గా పరిస్థితిని కంట్రోల్ చేయగలడు. అతడి విజయం వెనక ఇదే పెద్ద కారణం. ఇప్పుడు మా కెప్టెన్ ముందు ఓ పెద్ద సవాలు ఉంది. మా హోం గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియంలో మూడు మ్యాచులు ఆడితే.. అన్నింటిలో ఓడిపోయాం. ఆ లోటును పూడ్చుకోవాల్సి ఉంది" అని జితేశ్ శర్మ పేర్కొన్నాడు.
