
దుబాయ్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో సెప్టెంబర్ 19 నుండి ప్రారంభమయ్యే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 13వ సీజన్‌కు ముందు రాజస్థాన్ రాయల్స్ (ఆర్‌ఆర్) ఫ్రాంఛైజీ ఆదివారం కీలక నిర్ణయం తీసుకుంది. రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. లెజండరీ క్రికెటర్ వార్న్‌ను వరుసగా రెండో ఏడాది తమ బ్రాండ్ అంబాసిడర్‌గా ఆర్‌ఆర్ ఫ్రాంఛైజీ నియమించింది.
అంతేకాదు షేన్ వార్న్ ఆర్‌ఆర్ జట్టుకు మెంటార్‌గానూ వ్యవహరించనున్నారు. వార్న్ సారథ్యంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఆరంభ ఐపీఎల్ సీజన్ 2008లో చాంపియన్‌గా నిలిచింది. జట్టులోని యువ ఆటగాళ్లకు వార్న్ మార్గనిర్దేశనం చేయడానికి ఫ్రాంఛైజీ టైటిల్ విన్నింగ్ కెప్టెన్‌ను మళ్లీ ఆహ్వానించింది. షేన్ వార్న్ ఇవాళ 51వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. 2011 వరకు రాయల్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన లెజండరీ క్రికెటర్ ఆ తర్వాత క్రికెట్‌కు గుడ్‌బై చెప్పారు.
'రాజస్థాన్ రాయల్స్ ప్రాంచైజీ నాకు రెండు బాధ్యతలు అప్పగించినందుకు సంతోషం. నేను ఇష్టపడే ఆర్‌ఆర్ ఫ్రాంచైజీ, నా కుటుంబంలోకి తిరిగి రావడం ఎల్లప్పుడూ గొప్ప అనుభూతి. అభిమానులు ఇష్టపడే మరియు అనుసరించే గ్లోబల్ టీమ్‌గా మారాలనే ఉద్దేశంతో పనిచేస్తాం. ఈ సీజన్‌లో నేను టీమ్ మెంటర్‌గా పనిచేయడానికి ఎదురుచూస్తున్నా. జుబిన్ భారుచా, ఆండ్రూ మెక్‌డొనాల్డ్ వంటి అద్భుతమైన కోచింగ్ బృందం ఉంది' అని షేన్ వార్న్ తెలిపారు.
ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మేటి బ్యాట్స్‌మన్‌లను సైతం సునాయాసంగా బోల్తా కొట్టించి.. 'స్పిన్ మాంత్రికుడు' అని పేరు తెచ్చుకున్నారు. ఈ మాయాజాలంతో అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లు సాధించిన జాబితాలో వార్న్ (708 వికెట్లు) రెండో స్థానంలో కొనసాగుతున్నారు. ఆసీస్ తరఫున 145 టెస్టులు, 194 వన్డే మ్యాచ్‌లు ఆడాడు.