రాజస్థాన్ రాయల్స్ ఓటమికి ఆ స్టార్ ప్లేయరే కారణమా?
ఐపీఎల్ 2026 రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చేతిలో పరాజయం పాలై రాజస్థాన్ రాయల్స్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ ఓటమి తర్వాత రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ కుమార సంగక్కర ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ సామ్ కరన్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. సీజన్ ప్రారంభానికి ముందే సామ్ కరన్ జట్టుకు హ్యాండ్ ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగక్కర.. విదేశీ ఆటగాళ్లు తమ కాంట్రాక్టులను పూర్తిగా గౌరవించేలా బీసీసీఐ మరింత కఠినమైన నిబంధనలను తీసుకురావాలని డిమాండ్ చేశాడు.
సామ్ కరన్ ఈ ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందు తొడ గాయం నెపంతో టోర్నీ నుంచి తప్పుకున్నాడు. అయితే ఇంగ్లాండ్ తిరిగి వెళ్లిన సామ్ కరన్.. అక్కడ జరుగుతున్న 'టీ20 బ్లాస్ట్' లీగ్‌లో తన కౌంటీ జట్టు 'సర్రీ' తరఫున వరుసగా 3 మ్యాచ్‌లు ఆడాడు. గాయం అని చెప్పి ఐపీఎల్ మానేసి, అక్కడ మ్యాచ్‌లు ఆడుతుండటంతో సామ్ కరన్ చిత్తశుద్ధిపై ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనిపై స్పందించిన సంగక్కర.. సామ్ కరన్ సీజన్ మొత్తానికి అందుబాటులో ఉండడని తమకు చెప్పాడని, కానీ అతను సర్రీ జట్టు తరఫున మ్యాచ్‌లు ఆడటం చూసి తాము తీవ్ర నిరాశకు గురయ్యామని పేర్కొన్నాడు. సామ్ కరన్ స్థానంలో తాము దసున్ శనకను జట్టులోకి తీసుకోవాల్సి వచ్చిందని చెప్పాడు.

ఐపీఎల్‌లో విదేశీ ప్లేయర్ల లభ్యత అనేది ఎప్పటి నుంచో పెద్ద సమస్యగా మారింది. ఈ సీజన్‌లోనూ ఆస్ట్రేలియా స్టార్లు మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్ చిన్నపాటి ఫిట్‌నెస్ సమస్యల కారణంగా టోర్నీ రెండో దశలోనే తమ జట్లతో చేరారు. పంజాబ్ కింగ్స్ సహ-యజమాని మోహిత్ బర్మన్ కూడా ఈ విషయంపై స్పందిస్తూ.. విదేశీ ప్లేయర్లు ఆఖరి నిమిషంలో తప్పుకోవడం వల్ల జట్ల బ్యాలెన్స్ దెబ్బతింటోందని, దీనిపై బీసీసీఐ ఇతర అంతర్జాతీయ బోర్డులతో మాట్లాడి ఓ స్పష్టమైన అవగాహనకు రావాలని కోరాడు. వేలంలో అమ్ముడుపోయిన తర్వాత సరైన కారణం లేకుండా ఐపీఎల్ నుంచి తప్పుకునే విదేశీ ఆటగాళ్లపై రెండేళ్లపాటు నిషేధం విధించే నియమాన్ని బీసీసీఐ ఇప్పటికే అమలు చేస్తోంది.
ఈ సందర్భంగా బీసీసీఐ నిబంధనలను కుమార సంగక్కర సమర్థించాడు. ప్లేయర్లకు నిజంగానే తీవ్రమైన గాయాలైతే అర్థం చేసుకోవచ్చు కానీ ఇలాంటి ప్రవర్తన సరికాదని అన్నాడు. తమ జట్టులో ఆడమ్ మిల్నే, షిమ్రాన్ హెట్‌మెయర్, లువాన్-డ్రే ప్రిటోరియస్, క్వేనా మఫాకా వంటి ఆటగాళ్లకు ఎక్కువ మ్యాచ్‌లు ఆడే అవకాశం రాకపోయినా.. వారంతా జట్టుతోనే ఉంటూ, ప్రాక్టీస్ చేస్తూ తమ వంతు సహకారాన్ని అందించారని గుర్తుచేశాడు. ఒప్పంద బాధ్యతలను పూర్తి పారదర్శకతతో, నిజాయితీతో పాటించేలా బీసీసీఐ తన కఠినమైన విధానాన్ని ఇలాగే కొనసాగించాలని, అప్పుడే ఐపీఎల్ జట్లన్నింటికీ న్యాయం జరుగుతుందని సంగక్కర స్పష్టం చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications