టాప్ ఐపీఎల్ ఫ్రాంఛైజీ.. రాజస్థాన్ రాయల్స్ లో మార్పుల పర్వం కొనసాగుతోంది. మొన్నటికి మొన్న హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ తన పదవికి రాజీనామా చేశాడు. కీలక ప్లేయర్ సంజు శాంసన్ అప్పుడో.. ఇప్పుడో అన్నట్టు తయారయ్యాడు. ఈ ఫ్రాంఛైజీని వదిలే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ ఏడాది డిసెంబర్ లో జరిగే మెగా ఐపీఎల్ ఆక్షన్ కోసం తనను రిలీవ్ చేయాలని ఇదివరకే అతను మేనేజ్మెంట్ ను కోరాడు కూడా.
ఇదివరకే మార్కెటింగ్ హెడ్ ద్వీజేంద్ర పరాశర్ కూడా జట్టును విడిచిపెట్టారు. ఇప్పుడు తాజాగా రాజస్థాన్ రాయల్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జేక్ లష్ మెక్‌క్రమ్ వంతు వచ్చింది. మెక్ క్రమ్ తన పదవికి రాజీనామా చేశాడు. రాయల్స్ నుంచి వైదొలగినట్లు ప్రకటించాడు. 2021లో రాజస్థాన్ రాయల్స్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించాడు జేక్. అంతకుముందు ఇదే టీమ్ లో జూనియర్ స్థాయి నుంచి వివిధ హోదాల్లో పనిచేశాడు.

అక్టోబర్ నాటికి పూర్తిగా టీమ్ నుంచి రిలీవ్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం SA20 మెగా ఆక్షన్ లో మెక్‌క్రమ్ కనిపించకపోవడంతో తొలుత ఈ అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఆ తరువాత కొద్దిసేపటికే అతను అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించాడు. ఈ ఫ్రాంఛైజీ నుంచి దూరమైనట్లు తెలిపాడు. కాగా- రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ గా కుమార సంగక్కర.. తిరిగి రావడం దాదాపుగా ఖాయమైంది. ఎస్ఏ 20 వేలంలో రాయల్స్ బిడ్డింగ్‌ను అతను ముందుండి నడిపించాడు.
ఈ వరుస నిష్క్రమణలు రాయల్స్ ఫ్రాంచైజీలో ఏం జరుగుతుందనే ప్రశ్నలకు దారితీశాయి. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో తొమ్మిదో స్థానంలో నిలిచిన తర్వాత జట్టు భారీ మార్పులకు శ్రీకారం చుట్టిందనేది స్పష్టమౌతోంది. ఈ సీజన్ లో ఆర్ఆర్14 మ్యాచ్ లల్లో గెలిచింది నాలుగే. ఈ పరిణామాలు.. జట్టు ప్లేయర్ల నిలకడపై ప్రభావం చూపుతుందనే అంచనాలు ఉన్నాయి. ఎవరు ఉంటారు? ఎవరు వెళ్తారు అనేది హాట్ టాపిక్ అయింది.
ఈ పరిణామాలు.. జట్టు ప్లేయర్ల నిలకడపై ప్రభావం చూపుతుందనే అంచనాలు ఉన్నాయి. అటు కేప్టెన్సీ కోసం కుమ్ములాటలు చోటు చేసుకుంటోన్నాయి ఈ జట్టులో. సీనియర్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ ను జట్టు కేప్టెన్ గా కొనసాగించాలని ఓ గ్రూప్ పట్టుబట్టగా.. మరో రెండు పేర్లు తెరమీదికి వచ్చాయి. వికెట్ కీపర్ బ్యాటర్ రియాన్ పరాగ్ కు పూర్తిస్థాయిలో నాయకత్వ బాధ్యతలను అప్పగించాలని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. మరో గ్రూప్.. డాషింగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ పేరును ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.