న్యూఢిల్లీ : ఈ మధ్యకాలంలో ప్రపంచ క్రికెట్ లో కోహ్లి పేరు వినిపించినంతగా మరే క్రికెటర్ పేరు వినిపించలేదేమో..! ఫార్మాట్ ఏదైనా రన్ మెషీన్ తరహాలో ప్రతి మ్యాచ్ లోను తన సత్తా చాటుతూ సరికొత్త రికార్డ్స్ సెట్ చేస్తున్నాడు కోహ్లి. ఇదే క్రమంలో తన అసమాన ఆట తీరుకు మేటి క్రికెటర్ల నుంచి సహచరుల దాకా ప్రతి ఒక్కరితోను కితాబందకుంటున్నాడు.
తాజాగా సహచరుడు రైనా కోహ్లిపై ప్రశంసల్లో ముంచెత్తాడు. కోహ్లి లాంటి ఆటగాడు ప్రతి క్రికెటర్ కి ఆదర్శంగా నిలుస్తాడంటూ ఆకాశానికెత్తేశాడు. రన్ మెషీన్ తరహాలో ఎప్పుడూ పరుగుల దాహంతో క్రీజులోకి అడుగుపెట్టే కోహ్లి భిన్నమైన మైండ్ సెట్ ద్వారా టెస్టు, వన్డే, టీ20 మూడు ఫార్మాట్లలోను తన సత్తా చాటుతున్నాడని ప్రశంసించాడు.
అన్ని ఫార్మాట్లలోను ప్రస్తుతం కోహ్లి మార్క్ స్పష్టంగా కనపడుతోందని ప్రతి క్రికెటర్ కోహ్లి నుంచి ఎంతో నేర్చుకోవాలని సూచించాడు. మూడో స్థానంలో బ్యాటింగ్ కి వచ్చి భారీ శతకాలు బాదడంలో సహచరులంతా కోహ్లి నుంచి స్పూర్తి పొందాలన్నాడు. అన్నింటికంటే ముఖ్యంగా పొట్టి ఫార్మాట్ అయిన టీ20లోను కోహ్లి ఛేజింగ్ సూపర్బ్ అంటూ కొనియాడాడు.

ఇక అంతర్జాతీయ క్రికెట్ లో రైనా కంటే మూడు సంవత్సరాలు జూనియర్ అయిన కోహ్లి.. ఆట విషయంలో మాత్రం రయ్యిమని అందరి వెనక్కి నెట్టుకుంటు దూసుకుపోతున్నాడు. ఇప్పటికే పలు రికార్డులను తన పేర లిఖించుకున్న కోహ్లి.. 2008లో వన్డేల్లో వేగంగా 7000 పరుగులు, వేగంగా 25 సెంచరీలు, అంతర్జాతీయ టీ20 ల్లో అత్యధిక సగటు, ఒకే ఐపీఎల్ సీజన్ లో నాలుగు సెంచరీలు, అలాగే మొత్తంగా ఐపీఎల్ లోనే అత్యధిక పరుగుల రికార్డు కూడా (4110) కోహ్లి ఖాతాలోకి వెళ్లింది.
అత్యధిక పరుగుల జాబితాలో కోహ్లి తర్వాతి స్థానంలో రైనా (4,098) కొనసాగుతున్నాడు.