టీ20 వరల్డ్ కప్ చరిత్రలో అత్యంత నిలకడైన ప్రదర్శనతో సత్తాచాటే జట్టుగా పాకిస్థాన్‌కు మంచి ట్రాక్ రికార్డు ఉంది. 2007 తొలి టీ20 ప్రపంచకప్‌లో రన్నరప్‌గా నిలిచింది. ఆ తర్వాత 2009లో ఏకంగా ఛాంపియన్‌గా అవతరించింది. 2010, 2012, 2021లో సెమీఫైనల్స్ వరకు వచ్చింది. 2014, 2016 ప్రపంచకప్‌ల్లో సూపర్ 10కు అర్హత సాధించింది. గత 2022 పొట్టి కప్‌లో ట్రోఫీని తృటిలో చేజార్చుకుని మరోసారి రన్నరప్‌గా టోర్నీని ముగించింది.
గత మెరుగైన రికార్డులతో పాకిస్థాన్ మరోసారి భారీ అంచనాల మధ్య ఈ టీ20 వరల్డ్ కప్‌లో అడుగుపెట్టింది. అంతకంటే ముందు పాకిస్థాన్ క్రికెట్‌లో పెనుమార్పులు చోటుచేసుకున్నాయి. బాబర్ అజామ్‌కు తిరిగి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. రిటైర్మెంట్ ప్రకటించిన మహ్మద్ అమీర్, ఇమాద్ వసీమ్‌ను జట్టులోకి తీసుకువచ్చారు. అంతేగాక పాకిస్థాన్ ఆటగాళ్లకు ఫిట్‌నెస్ మెరుగుపర్చడానికి ఆర్మీ శిక్షణ ఇవ్వడం కొసమెరపు!

ఈ తతంగం తర్వాత పాకిస్థాన్ సంచలన ప్రదర్శన చేసిందా అంటే అదీ లేదు. అమెరికాను తక్కువగా అంచనా వేసి కంగుతింది. అనంతరం ఎప్పటిలానే భారత్ చేతిలో చిత్తుగా ఓడింది. కెనడాపై ఓదార్పు విజయం సాధించి సూపర్-8 కోసం దేవుడిపై భారం వేసింది. కానీ వరుణుడు పాకిస్థాన్‌కు షాక్ ఇచ్చాడు. ప్రతీసారి అదృష్టాన్నీ నమ్ముకుంటే కుదరదని చెప్పేశాడు. 1992 వరల్డ్ కప్‌లో వరుణుడి ద్వారానే పాకిస్థాన్ టైటిల్ గెలిచిన విషయాన్ని క్రికెట్ అభిమానులు అంత ఈజీగా మరిచిపోలేరు.
1992 మెగాటోర్నీలో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ 74 పరుగులకే ఆలౌటైంది. కానీ ఆ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. ఇరు జట్లకు చెరో పాయింట్ ఇచ్చారు. అయితే ఆ ఒక్క పాయింట్ పాకిస్థాన్‌కు వరంగా మారింది. సెమీఫైనల్‌కు అర్హత సాధించేలా చేసింది. ఆ తర్వాత సెమీస్, ఫైనల్‌లో గెలిచి పాక్ విజేతగా నిలిచింది. ఈసారి కూడా మరోసారి అలాంటి అద్భుతం జరుగుతుందేమో అని బాబర్ అజామ్ సేన భావించింది.
ఐర్లాండ్ చేతిలో అమెరికా ఓడిపోతుందని, ఆ తర్వాత ఐర్లాండ్‌ను ఓడించి సూపర్-8కు వెళ్లాలని పాకిస్థాన్ కలలు కనింది. కానీ అప్పుడు కాపాడిన వరుణుడు ఈ సారి పాకిస్థాన్‌కు విలన్‌గా మారాడు. అమెరికా-ఐర్లాండ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దవ్వడంతో పాక్ టోర్నీ నుంచి గ్రూప్ దశలోనే నిష్క్రమించింది.