
న్యూజిల్యాండ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత జట్టు గెలుపు గీత దాటలేకపోయింది. వర్షం అంతరాయం కలిగించడంతో డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో మ్యాచ్ డ్రాగా ముగిసినట్లు అంపైర్లు ప్రకటించారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిల్యాండ్ సారధి టిమ్ సౌథీ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో ఓపెనర్ డెవాన్ కాన్వే (59), గ్లెన్ ఫిలిప్స్ (54) ఇద్దరూ అర్థశతకాలతో రాణించారు. అయితే భారత పేసర్లు చివర్లో పుంజుకొని కివీస్‌ను ఆలౌట్ చేశారు. దీంతో ఆ జట్టు 19.4 ఓవర్లలో 160 పరుగులకే చాప చుట్టేసింది. అర్షదీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్ చెరో నాలుగు వికెట్లు తీసుకున్నారు.
లక్ష్య ఛేదనలో భారత్‌కు శుభారంభం దక్కలేదు. ఇషాన్ కిషన్ (10), రిషభ్ పంత్ (11) మరోసారి విఫలమయ్యారు. వర్షం పడితే డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో విజేతను నిర్ణయిస్తారనే ఆలోచనతో భారత ఆటగాళ్లు భారీ షాట్లు ఆడేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే సూర్యకుమార్ యాదవ్ (13) అవుటవగా.. శ్రేయాస్ అయ్యర్ (0) మరోసారి షార్ట్ బాల్‌ను సరిగా ఆడలేక పెవిలియన్ చేరాడు. దీంతో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా (30 నాటౌట్) చక్కగా ఆడాడు. అతనికి దీపక్ హుడా (9 నాటౌట్) సహకారం అందించాడు.

భారత జట్టు గెలవడం కష్టంలా కనిపిస్తున్న ఇలాంటి తరుణంలో వర్షం పడింది. దీంతో అంపైర్లు ఆటను నిలిపివేశారు. ఎంత సేపటికీ వర్షం ఆగలేదు. మరీ పెద్దది అయింది. దీంతో మ్యాచ్‌ను ముగించేశారు. డీఎల్ఎస్ పద్ధతిలో భారత జట్టు టార్గెట్ 9 ఓవర్లలో 75గా నిర్ణయించారు. ఆట ముగిసే సమయానికి టీమిండియా 75/4 స్కోరుతో నిలిచింది. దీంతో ఈ మ్యాచ్ డ్రా అయినట్లు అంపైర్లు ప్రకటించారు. బంతితో నిప్పులు చెరిగిన మహమ్మద్ సిరాజ్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది. రెండో టీ20లో సెంచరీతో చెలరేగిన సూర్యకుమార్ యాదవ్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' అవార్డు లభించింది.