
హైదరాబాద్: ప్రతిష్టాత్మక యాషెస్ సిరిస్‌లో పెర్త్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా గెలుపు దిశగా పయనిస్తోంది. ఇప్పటికే సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో కొనసాగుతున్న ఆస్ట్రేలియా మూడో టెస్టులో విజయానికి ఆరు వికెట్ల దూరంలో ఉంది.
ఇంగ్లాండ్ vs ఆస్ట్రేలియా 2017 3వ టెస్టు స్కోరు కార్డు
మూడో టెస్టులో చివరి రోజైన సోమవారం వరుణుడు అంతరాయం కల్పించకపోతే ఆస్ట్రేలియా ఖాతాలో యాషెస్ సిరీస్ చేరడం ఖాయమనిపిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో 403 పరుగులు చేసినప్పటికీ ఇంగ్లాండ్‌కు ఓటమి తప్పేలా లేదు. నాలుగో రోజైన ఆదివారం వర్షం వల్ల ఆట త్వరగా ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 132 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది.
వర్షం కారణంగా నాలుగో రోజు 66 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. ఆదివారం ఉదయం ఓవర్ నైట్ స్కోరు 549/4తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలియా 662/9 వద్ద డిక్లేర్ చేసింది. స్టీవ్ స్మిత్ (239) ఓవర్‌నైట్ స్కోరుకు 10 పరుగులు జోడించాడు. మిచెల్ మార్ష్ (181) ఒక్క పరుగు జోడించకుండానే వెనుదిరిగాడు.
యాషెస్‌లో సొంతగడ్డపై ఆసీస్‌కు ఇదే అత్యధిక స్కోరు కాగా, ఇంగ్లండ్‌పై ఓవరాల్‌గా ఐదో అత్యుత్తమం. ఇంగ్లాండ్ పేసర్ జేమ్స్ అండర్సన్(4/116) నాలుగు వికెట్లతో ఆకట్టుకున్నాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ ఆసీస్ పేసర్ హాజిల్‌వుడ్ (2/23) ధాటికి ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో4 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది.
ప్రస్తుతం మలన్ (28 బ్యాటింగ్), బెయిర్‌స్టో (14 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ అలెస్టర్ కుక్ (14), స్టోన్‌మన్ (3), విన్స్ (55), కెప్టెన్ రూట్ (14) పరుగులకే పెవిలియన్‌కు చేరారు. జేమ్స్ విన్స్(55) హాఫ్ సెంచరీతో రాణంచాడు. ఇంగ్లాండ్ చేతిలో ఇంకా ఆరు వికెట్లు ఉన్నా... తొలి ఇన్నింగ్స్‌లో 127 పరుగుల వెనుకంజలో ఉన్నది.
ఆస్ట్రేలియా బౌలర్లలో హాజల్‌వుడ్ రెండు మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్ చెరో వికెట్ తీశారు.
పెర్త్ టెస్టు:
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్: 403 ఆలౌట్
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 662/9 డిక్లేర్
ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్: 132/4 (38.2 ఓవర్లు)
తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 127 పరుగుల వెనుకంజలో ఉంది.
సోమవారం ఐదోరోజు ఆట జరగాల్సి ఉంది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.