ఈ ఏడాది చివర్లో జరిగే వరల్డ్ కప్‌లో ఆడేందుకు సౌతాఫ్రికా అర్హత సాధించింది. ఐర్లాండ్, బంగ్లాదేశ్ మధ్య మంగళవారం జరగాల్సిన వన్డే మ్యాచ్ వర్షార్పణమైంది. ఈ ఫలితం సౌతాఫ్రికాకు కలిసొచ్చింది. ఈ మ్యాచ్ రద్దవడంతో వరల్డ్ కప్ సూపర్ లీగ్‌లో సౌతాఫ్రికా 8వ స్థానాన్ని కైవసం చేసుకుంది.
బంగ్లాదేశ్‌తో జరిగే మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో ఐర్లాండ్ క్లీన్ స్వీప్ చేస్తే.. ఆ జట్టు ఎనిమిదో స్థానంలో నిలిచేది. అయితే తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో ఐర్లాండ్‌కు ఈ అవకాశం లేకుండా పోయింది. దీంతో వరల్డ్ కప్‌లో తలపడే జట్లు ఫైనల్ జాబితాలో సఫారీలకు చోటు దక్కింది. ఐర్లాండ్ ఈ ఏడాది ఇక వరల్డ్ కప్ ఆడటం కుదరదు.

ఈ ఏడాది మంచి ఫామ్ కనబరిచిన సౌతాఫ్రికా.. ఇంగ్లండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో గెలిచింది. ఆ తర్వాత నెదర్లాండ్‌పై 2-0తో సిరీస్ నెగ్గింది. వెస్టిండీస్‌తో జరిగిన రెండు వన్డేల సిరీస్‌ను 1-1తో డ్రా చేసుకుంది. ఈ ఫలితాలు కూడా టెంబా బవుమా టీంకు కలిసొచ్చాయి. ఈ కారణంగానే వరల్డ్ కప్ సూపర్ లీగ్‌లో 8వ స్థానాన్ని కైవసం చేసుకుంది.
అలాగే న్యూజిల్యాండ్ చేతిలో శ్రీలంక 2-0 తేడాతో ఓడిపోవడం కూడా సఫారీలకు కలిసొచ్చింది. ఈ వరల్డ్ కప్ టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న భారత జట్టు నేరుగా వరల్డ్ కప్‌లో ఆడేందుకు అర్హత సాధించింది. అయితే టీమిండియా వద్ద ప్రస్తుతం 139 పాయింట్లు ఉన్నాయి. ఐర్లాండ్‌పై బంగ్లాదేశ్ ఒక్క మ్యాచ్ గెలిచినా కూడా.. ఈ జాబితాలో భారత్‌ను ఆ టీం దాటేస్తుంది.
ఇప్పుడు సౌతాఫ్రికా కూడా ఈ మెగా ఈవెంట్‌కు క్వాలిఫై అయింది. భారత్, సౌతాఫ్రికా కాకుండా ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, న్యూజిల్యాండ్, పాకిస్తాన్ కూడా ఈ టోర్నీకు నేరుగా అర్హత సాధించాయి. ఇవి కాకుండా వెస్టిండీస్, శ్రీలంక, జింబాబ్వే, ఐర్లాండ్, నెదర్లాండ్, స్కాట్లాండ్, ఒమన్, నేపాల్, యూఎస్ఏ, యూఏఈ జట్లు మాత్రం జూన్ నెలలో జరిగే క్వాలిఫైయర్స్ ఆడాల్సి ఉంటుంది.