వెలుగులోకి మరో యువ క్రికెటర్: ఎవరీ రాహుల్ త్రిపాఠి (ఫోటోలు)
హైదరాబాద్: ఐపీఎల్ పదో సీజన్‌లో సీనియర్ ఆటగాళ్లతో పోలిస్తే యువ ఆటగాళ్లు సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. తాజాగా బుధవారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మరో యువ ఆటగాడు సత్తా చాటాడు. తన అద్భుత ప్రదర్శనతో పూణె జట్టును విజయతీరాలకు చేర్చాడు.
అతడే రాహుల్ త్రిపాఠి. ధనాధన్ బ్యాటింగ్‌తో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై విరుచుకుపడ్డాడు. అద్భుతమైన షాట్లు కొడుతూ.. అలవోకగా ఫోర్లు, సిక్సర్లు బాదేశాడు. అంతర్జాతీయ అనుభవం లేకున్నా.. ఈ సీజన్‌తోనే వెలుగులోకి వచ్చిన అతడు విధ్వంసక బ్యాటింగ్ చేశాడు.
రాహుల్ త్రిపాఠి పూర్తి పేరు రాహుల్ అజయ్ త్రిపాఠి. 1991లో మహారాష్ట్రలోని రాంచీలో జన్మించాడు. తండ్రి ఆర్మీలో పనిచేశారు. రాహుల్ తండ్రి కూడా ఉత్తర ప్రదేశ్ జూనియర్ లెవెల్ తరుపున క్రికెట్ ఆడారు. అందుచేతనే రాహుల్‌కి చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే మక్కువ.
లోకల్ క్రికెట్‌లో భాగంగా జరిగిన ఓ టోర్నీలో రాహుల్ త్రిపాఠి ఒకే ఓవర్‌లో ఆరు సిక్సులు రెండు సార్లు బాదాడు. దేశవాళీ క్రికెట్‌లో మహారాష్ట్ర జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన ఐపీఎల్ వేలంలో రాహుల్‌ను రూ. 10 లక్షల కనీస ధరకు పూణె కొనుగోలు చేసింది.

52 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 93 పరుగులు
ఓవైపు వికెట్లు పడుతున్నా 52 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 93 పరుగులు చేసి జట్టుకు ఒంటిచేత్తో విజయాన్ని అందించాడు. ఈడెన్ గార్డన్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో రాహుల్ త్రిపాఠి సూపర్ షోతో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై రైజింగ్ పూణె సూపర్ జెయింట్స్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

త్రిపాఠిపై కెప్టెన్ స్మిత్ ప్రశంసలు
మ్యాచ్ అనంతరం రాహుల్ త్రిపాఠి ప్రదర్శనతో ఉబ్బితబ్బిబైన పూణె కెప్టెన్ స్టీవ్ స్మిత్ అతడిని ప్రశంసల్లో ముంచెత్తాడు. 'రాహుల్ త్రిపాఠి అంటే ఏమిటో మాకు ఈ మ్యాచ్ తెలిసేలా చేసింది. మ్యాచ్‌లో రానురాను వికెట్ స్లోడౌన్ అవుతుందని మేం భావించాం. అందుకే ఆరంభ పవర్ ప్లేలోనే ఎక్కువ పరుగులు సాధించేందుకు ప్రయత్నించాం' అని స్మిత్ అన్నాడు.

సెంచరీకి త్రిపాఠి ఎంతో అర్హుడు
'త్రిపాఠి బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నాడు. దురదృష్టవశాత్తు అతను సెంచరీ చేయలేదు. సెంచరీకి అతను ఎంతో అర్హుడు' అని స్టీవ్ స్మిత్ అన్నాడు. వరుసగా హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేయడంపై స్టీవ్ స్మిత్ హర్షం వ్యక్తం చేశాడు. గడిచిన ఏడు మ్యాచ్‌ల్లో ఆరింటిలో గెలుపొందడం ఆనందంగా ఉందని చెప్పాడు.

20 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 155 పరుగులు
ఈడెన్ గార్డెన్స్ వేదికగా రైజింగ్ పుణె సూపర్‌జెయింట్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. అనంతరం 156 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పూణె 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. రాహుల్ త్రిపాఠి 52 బంతుల్లో 9 ఫోర్లు 7 సిక్సర్ల సాయంతో 93 పరుగులతో రాణించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications