టీమిండియా మాజీ ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ తిరిగి ఐపీఎల్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు. గతంలో తాను కోచ్‌గా పనిచేసిన రాజస్థాన్ రాయల్స్‌కు హెడ్ కోచ్ మరోసారి బాధ్యతలు అందుకున్నాడు. టీ20 వరల్డ్ కప్ ముగిసిన అనంతరం భారత జట్టు కోచ్ పదవి నుంచి ద్రవిడ్ తప్పుకున్న విషయం తెలిసిందే.
11 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత టీమిండియా టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన ద్రవిడ్ కోసం పలు ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. అయితే ఊహాగానాలకు తగ్గట్లుగానే ద్రవిడ్.. అంతిమంగా రాజస్థాన్ ఫ్రాంచైజీతోనే తిరిగి చేతులు కలిపాడు. కాగా, తమ కొత్త ప్రధాన కోచ్‌ను రాజస్థాన్ రాయల్స్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే ద్రవిడ్ కోచ్‌గా తన వేట మొదలుపెట్టాడు. ఫ్రాంచైజీ అధికారులతో సమావేశానికి హాజరయ్యాడు.

అయితే మీటింగ్ రూమ్‌లోకి వస్తూ ద్రవిడ్ చేసిన హంగామాను రాజస్థాన్ రాయల్స్ సోషల్ మీడియాలో పంచుకుంది. ద్రవిడ్ డోర్ ఓపెన్ చేస్తూ.. 'హలో.. ఐపీఎల్ గెలిచేది ఇక్కడే' అంటూ ఎంటర్ అయ్యాడు. ఈ సారి మనం కప్ కొడుతున్నామంటూ ద్రవిడ్ చెప్పిన ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా, 2011 నుంచి 2015 మధ్య రాజస్థాన్‌కు కెప్టెన్‌గా, కోచ్‌గా ద్రవిడ్ వ్యవహరించాడు. 2013లో ఆటకు గుడ్‌బై చెప్పి 2014 నుంచి పూర్తిగా కోచింగ్ బాధ్యతలు చూసుకున్నాడు.
''గతంలో కొన్నేళ్ల పాటు ఇంటిగా పిలిచే ఫ్రాంచైజీకి తిరిగి వచ్చినందుకు సంతోషంగా ఉంది. ప్రపంచకప్ తర్వాత మరో సవాల్ స్వీకరించాలని అనుకోవడం సముచితమని భావించా. అందుకు రాజస్థాన్ రాయల్స్ సరైన వేదిక'' అని ద్రవిడ్ పేర్కొన్నాడు.
కాగా, మరికొన్ని నెలల్లో ఐపీఎల్ మెగా వేలం జరగనున్న విషయం తెలిసిందే. దీని కోసం ద్రవిడ్ ప్రణాళికలు మొదలుపెట్టాడు. గత సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించినప్పటికీ ఫైనల్స్‌కు క్వాలిఫై కాలేకపోయింది. జట్టులో కీలక ప్లేయర్లు ఉన్నప్పటికీ మ్యాచ్ విన్నర్లు తక్కువగా ఉన్నారు. మెగా వేలంలో జట్టును సమతూకం చేసేలా నయా కోచ్ ప్లాన్స్ మొదలుపెట్టాడు.