యువీ, ధోనిలను సాగనంపండి: ద్రవిడ్ సంచలనం
హైదరాబాద్: వరల్డ్ కప్ 2019 కోసం టీమిండియాను సన్నద్ధం చేయాల్సిన సమయం ఆసన్నమైందని ఇండియా ఏ, అండర్-19 కోచ్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు. గత కొన్నాళ్లుగా సరైన ఆటతీరు కనబర్చలేకపోతున్న సీనియర్ ఆటగాళ్లు ధోని, యువరాజ్‌లపై కూడా ద్రవిడ్ స్పందించాడు.
2019 వరల్డ్ కప్ లక్ష్యంగా ఈ ఇద్దరి భవితవ్యంపై నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చిందని చెప్పాడు. ధోని, యువరాజ్ ఇద్దరూ 36 ఏళ్లకు చేరువవుతున్నారు. 2019 వరల్డ్ సమయానికి ఇద్దరి వయసూ 38కి చేరువవుతుంది. ఆ సమయానికి ఇద్దరూ ఏమాత్రం ఫిట్‌గా, ఫామ్‌లో ఉంటారనే సందేహాన్ని కూడా వ్యక్తం చేశాడు.

ధోని, యువీల భవితవ్యంపై ద్రవిడ్
ఈ నేపథ్యంలో వీరి భవితవ్యంపై సెలెక్టర్లు, మేనేజ్‌మెంట్ నిర్ణయం తీసుకోవడానికి ఇదే సరైన సమయమని ద్రవిడ్ స్పష్టం చేశాడు. వరల్డ్ కప్‌కు రెండేళ్లు కూడా సమయం లేని నేపథ్యంలో ఇప్పట్నుంచే సన్నాహాలు మొదలవ్వాలని, కాబట్టి ధోని, యువీల విషయంలో సెలక్టర్లు స్పష్టతతో ఉండాలని పేర్కొన్నాడు.

ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి
'సెలక్టర్లు ఆ ఇద్దరి విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. రెండేళ్ల తర్వాత వీళ్ల పాత్రను ఎలా చూడబోతున్నారన్నది ముఖ్యం. అప్పటికీ ఈ ఇద్దరికీ జట్టులో చోటుంటుందా? లేక ఒకరు మాత్రమే ఉంటారా? వారి సామర్థ్యాన్ని మరోసారి అంచనా వేయడానికి సంవత్సరం పడుతుందా.. లేక ఆరు నెలలా?' అని ప్రశ్నల వర్షం కురిపించాడు.

ఛాంపియన్స్ ట్రోఫీలో 4, 5 స్థానాల్లో బ్యాటింగ్
అంతేకాదు ఈ ఇద్దరికీ అవకాశం కల్పించే ముందు యువ ప్రతిభను పరీక్షించాలనుకుంటున్నారా? అని ద్రవిడ్ అన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో 4, 5 స్థానాల్లో యువరాజ్, ధోనిలు బ్యాటింగ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఇద్దరూ అంచనాలకు తగ్గట్టు ఆడలేకపోయారు. ఫైనల్లో ఓటమి నేపథ్యంలో ఈ ఇద్దరిపై వేటు వేయాలన్న డిమాండ్ ఊపందుకుంటోంది.

యువ క్రికెటర్లకు అవకాశం
దీంతో పాటు జూన్ 23(శుక్రవారం) నుంచి ప్రారంభం కానున్న వెస్టిండీస్ సిరీస్ కోసం పూర్తిస్థాయి జట్టును ప్రకటించినప్పటికీ.. యువ క్రికెటర్లకు అవకాశం ఇవ్వడం ద్వారా ఇకనైనా ప్రయోగాలు చేయాలని ఆయన జట్టు మేనేజ్‌మెంట్‌కు రాహుల్ ద్రవిడ్ సూచించాడు. ఇప్పుడు అవకాశాలు ఇవ్వకుండా.. ఏడాదో, ఆరు నెలల తర్వాతో ఇలాంటి పరిస్థితి తలెత్తినప్పుడు చింతిస్తే ప్రయోజనం ఉండదని ద్రవిడ్ అన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications