
హైదరాబాద్: ప్రస్తుతం అండర్-19 జట్టుకు ప్రధాన కోచ్‌గా ఉన్న భారత క్రికెట్ మాజీ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ గురువారం 45వ పుట్టినరోజుని జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా మాజీ క్రికెటర్లతో పాటు ప్రస్తుత క్రికెటర్లు ద్రవిడ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
టీమిండియాకు 16 ఏళ్ల పాటు సేవలందించిన రాహుల్ ద్రవిడ్‌ను అభిమానులు ముద్దుగా ద వాల్, మిస్టర్ డిపెండబుల్, కెప్టెన్ కూల్‌గా పిలుచుకుంటారు. కాగా, రాహుల్ ద్రవిడ్ మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఒక మరాఠీ ఫ్యామిలీలో ద్రవిడ్ జన్మించాడు. ద్రవిడ్ పుట్టిన తర్వాత అతని ఫ్యామిలీ ఇండోర్ నుంచి కర్నాటక రాజధాని బెంగళూరుకు వెళ్లిపోయింది.
అతని తల్లి ఆర్కిటెక్చర్ ప్రొఫెసర్‌గా పనిచేసేవారు. రాహుల్ స్కూలింగ్ బెంగళూరులోని సెయిట్ బాయిస్ హై స్కూలులో జరిగింది. ఆ తర్వాత సెయింట్ జోసెఫ్ కాలేజీలో కామర్స్‌లో పట్టా అందుకున్నాడు. రాహుల్ ఇంగ్లీష్, మరాఠీ, కన్నడ, హిందీ బాషల్లో ప్రావీణ్యం సంపాదించాడు.
2003లో రాహుల్ నాగపూర్‌నకు చెందిన విజేతా పెండ్రేకర్‌ను వివాహం చేసుకున్నాడు. ద్రవిడ్‌కు ఇద్దరు కుమారులు. 2012లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ద్రవిడ్ మొత్తం 24,208 పరుగులు నమోదు చేశాడు. టెస్టుల్లో 13288 పరుగులు చేశాడు. అందులో 36 సెంచరీలు ఉన్నాయి.
క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన ఆరో బ్యాట్స్‌మన్‌గా రికార్డు నమోదు చేశాడు. ప్రస్తుతం ఇండియా ఏ, అండర్-19 జట్లకు కోచ్‌గా యువ క్రికెటర్లకు మెరుగులు దిద్దుతూ భారత క్రికెట్‌కు మార్గదర్శిగా నిలుస్తున్నాడు.