
హైదరాబాద్: రాహుల్ ద్రవిడ్... తన కెరీర్‌లో ఎన్నో రికార్డులతో పాటు అవార్డులను సొంతం చేసుకున్న క్రికెటర్. ప్రస్తుతం టీమిండియా అండర్-19 జట్టు కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం అనేది రాహుల్ ద్రవిడ్ లక్షణం. ఎప్పుడూ ఓ సామాన్యుడిలా, నిరాడంబరంగానే కనిపిస్తుంటాడు.
వివాదాలు లేని వ్యక్తిగా, భారత క్రికెట్‌లో 'ది వాల్'గా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినప్పటికీ యువ క్రికెటర్లకు శిక్షణ ఇచ్చేందుకు ముందుకొచ్చాడు. తాను తలచుకుంటే టీమిండియా ప్రధాన కోచ్ బాధ్యతలు చేపట్టొచ్చు. అందుకు బీసీసీఐ కూడా సుముఖంగానే ఉంది.
అయినా సరే, తాను యువ ఆటగాళ్లకు కోచ్‌గా ఉంటానని అండర్-19 జట్టు కోచ్‌గా యువ ఆటగాళ్లకు సానపడుతున్నాడు. తాజాగా, ద్రవిడ్ సింప్లిసిటీకి సంబంధించిన ఓ సంఘటన వెలుగులోకి వచ్చింది. రాహుల్ ద్రవిడ్‌కు ఇద్దరు కుమారులు సమిత్, అన్వే. వారిద్దరూ సైన్స్ ఎగ్జిబిషన్‌ను వీక్షించేందుకు కావాల్సిన టికెట్ల కోసం రాహుల్ ద్రవిడ్ క్యూలో నిల్చున్నాడు.

ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇలాంటి ఎగ్జిబిషన్ల కోసం వీఐపీ పాస్‌లు ఉన్నప్పటికీ వాటిని ఉపయోగించుకోకుండా సాధారణ ప్రజల వలే క్యూలో నిలబడటంతో రాహుల్ ద్రవిడ్ సింప్లిసిటీపై సోషల్ మీడియాలో అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.