కోల్‌కతా: ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీలకు తయారు చేసిన పిచ్‌లపై భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బౌలింగ్ డార్ట్స్ నుంచి ఆరేడు వికెట్లు పడడం రోజువారీ చర్యగా మారిందని ఆయన అన్నారు. ఉత్తమ క్రికెటర్లను రూపొందించడానికి అవి ఆటంకంగా మారుతాయని చెప్పారు.
ఇటువంటి పిచ్‌ల వల్ల సమయం, శక్తి, డబ్బులు వృధా చేసుకోవడమేనని ద్రావిడ్ అన్నారు. రెండు రోజుల్లోగా ఐదు మ్యాచులు ముగిసే విధంగా పిచ్‌లు ఉండడాన్ని ఆయన తప్పు పట్టారు. గ్రీన్ టాప్స్ అవసరం లేదని, అదే సమయంలో రెండు రోజుల్లో మ్యాచులు ముగిసే పిచ్‌లు కూడా అవసరం లేదని ఆయన అన్నారు.
డార్ట్స్ బౌలింగ్ చేసేవారికి ఆరేడు వికెట్లు లభిస్తున్నాయని అన్నారు. ఆ విధంగా ముందుకు సాగడం మంచిది కాదని అన్నారు. హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్ మధ్య జరిగిన మ్యాచులో ఒక రోజులో 26 వికెట్లు పడ్డాయి. ఒడిశా చేతిలో బెంగాల్ 37 పరుగులకే అవుటైంది.

మ్యాచులు రెండు లేదా మూడు రోజుల్లో ముగియడం భారత క్రికెట్ ఆరోగ్యానికి మంచిది కాదని ద్రావిడ్ అన్నారు. అంతర్జాతీయ క్రికెట్ విభిన్నమైన బాల్ గేమ్ అని, రంజీ ట్రోఫీ భవిష్యత్తులో మంచి ఆటగాళ్లు తయారు కావడానికి ఉపయోగపడాలని అన్నారు.
తీవ్రమైన అసంతృప్తిగా ఉందని, తాను అక్కడ ఉన్నాను కాబట్టి ప్రత్యేకంగా బెంగాల్ మ్యాచ్ గూరించి చెప్పడం తన అభిమతం కాదని, ఈ రంజీ ట్రోఫీలో తన అభిప్రాయం ప్రకారం దివాళాకోరు పిచ్‌లు రూపొందించారని అన్నారు.
ఇటువంటి బ్యాడ్ వికెట్లపై ఆడితే ఉత్తమ క్రికెటర్లను తయారు చేయలేమని అన్నారు. నాకవుట్ మ్యాచులు తటస్థ వేదికలపై జరగడం ఒక రకంగా సంతోషకరమైన విషయమని, నాకవుట్ దశలోని పిచ్‌లు బాగుంటాయని తాను భావిస్తున్నానని ద్రావిడ్ అన్నారు.