T20 World Cup 2026: ప్రస్తుతం క్రికెట్ ప్రపంచం అంతా భారత్, శ్రీలంక వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2026 వైపు చూస్తోంది. ముఖ్యంగా సూపర్-8 దశకు చేరుకున్న ఈ టోర్నీలో ఏ జట్లు సెమీఫైనల్, ఫైనల్ చేరుతాయనే ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలోని భారత జట్టుతో పాటు ఓ అంచనాలకు అందని జట్టు ఫైనల్ చేరితే బాగుంటుందని ఆయన తన మనసులోని మాటను బయటపెట్టారు.
జింబాబ్వే సంచలనంపై ద్రవిడ్ ప్రశంసలు
సాధారణంగా వరల్డ్ కప్ ఫైనల్ అంటే భారత్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా లేదా ఇంగ్లాండ్ వంటి జట్ల మధ్య పోరు ఉంటుందని అందరూ ఊహిస్తారు. కానీ రాహుల్ ద్రవిడ్ మాత్రం జింబాబ్వే జట్టు వైపు మొగ్గు చూపారు. ఈ టోర్నీలో జింబాబ్వే అద్భుత ప్రదర్శన చేస్తూ మాజీ ఛాంపియన్ ఆస్ట్రేలియాను ఓడించి సూపర్-8కు రావడం చూసి ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దక్షిణాఫ్రికా, పాకిస్థాన్ వంటి పెద్ద జట్లే కాకుండా.. జింబాబ్వే లాంటి దేశం ఫైనల్ చేరితే అది ప్రపంచ క్రికెట్ విస్తరణకు.. ఆ దేశ క్రీడాకారుల భవిష్యత్తుకు ఎంతో మేలు చేస్తుందని రాహుల్ ద్రవిడ్ అభిప్రాయపడ్డారు.

భారత్ బలం 'ఒక్కరిపై ఆధారపడకపోవడమే'
సూపర్-8 లో భాగంగా అహ్మదాబాద్‌లో దక్షిణాఫ్రికాతో జరగబోయే కీలక పోరుకు ముందు టీమిండియా బలాబలాలను ద్రవిడ్ విశ్లేషించారు. భారత జట్టుకు ఉన్న అతిపెద్ద సానుకూల అంశం ఏమిటంటే.. జట్టులో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో లోతు ఎక్కువగా ఉండటం. భారత్ కేవలం సూర్యకుమార్ యాదవ్ లేదా హార్దిక్ పాండ్యా వంటి ఒకరిద్దరు స్టార్ ప్లేయర్లపై ఆధారపడకుండా, ప్రతి మ్యాచ్‌లోనూ ఒక కొత్త మ్యాచ్ విన్నర్ పుట్టుకురావడం జట్టుకు కలిసివచ్చే అంశమని ఆయన పేర్కొన్నారు.
అసోసియేట్ దేశాల అద్భుత పోరాటం
ఈ ప్రపంచకప్‌లో పెద్ద జట్లకు చిన్న జట్లు గట్టి పోటీ ఇవ్వడాన్ని ద్రవిడ్ ప్రత్యేకంగా కొనియాడారు. పాకిస్థాన్ జట్టు నెదర్లాండ్స్ చేతిలో ఓడిపోయేంత పని కావడం, అమెరికా బౌలర్లు భారత టాపార్డర్‌ను ముప్పుతిప్పలు పెట్టడం వంటి సంఘటనలు క్రికెట్ మారుతున్న తీరుకు నిదర్శనమని ఆయన అన్నారు. అసోసియేట్ దేశాల్లో అద్భుతమైన ప్రతిభ ఉందని, వారు సూపర్-8 కు క్వాలిఫై అవ్వకపోయినా, వారి ఆట తీరుతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానుల మనసు గెలుచుకున్నారని ద్రవిడ్ ప్రశంసించారు.
హెచ్చరించిన ద్రవిడ్
చివరగా టీ20 ఫార్మాట్ అనేది అత్యంత అనిశ్చితమైన క్రీడ అని.. ఇక్కడ కేవలం ఒక్క ఓవర్ ఫలితాన్ని మార్చేస్తుందని ద్రవిడ్ హెచ్చరించారు. భారత జట్టు ఫలితాల గురించి ఎక్కువగా ఆందోళన చెందకుండా, తమ వ్యూహాలను అమలు చేయడం మీద దృష్టి పెడితే చాలని సూచించారు. "మనం చేయాల్సింది మనం చేసి, మంచి ఫలితం కోసం ఎదురుచూడాలి" అంటూ తనదైన శైలిలో టీమిండియాకు సలహా ఇచ్చారు. మరి ద్రవిడ్ కోరుకున్నట్టుగా జింబాబ్వే ఫైనల్ చేరి భారత్‌ను ఎదుర్కొంటుందో లేదో చూడాలి.