హైదరాబాద్: టీమిండియా బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా బాధ్యతలు స్వీకరించేందుకు అండర్-19 కోచ్ రాహుల్ ద్రవిడ్ విముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు బీసీసీఐ పరిపాలక కమిటీ (సీఓఏ) చీఫ్ వినోద్ రాయ్ స్పష్టం చేశారు. టీమిండియా విదేశీ పర్యనటలకు రాహుల్ ద్రవిడ్ అందుబాటులో ఉండటం లేదని ఆయన పేర్కొన్నారు.
'ద్రవిడ్‌కు అండర్-19, భారత్ 'ఎ' జట్ల కోచ్‌గా రెండేళ్ల ఒప్పందం ఉంది. వచ్చే ఏడాది అండర్-19 ప్రపంచకప్, అలాగే కొన్ని 'ఎ' సిరీస్‌లు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో సీనియర్ జట్టు వెంట ఆయన విదేశీ పర్యటనలకు వెళ్లే సమయం లేదు. అయితే కోచ్ రవిశాస్త్రి సూచన మేరకు జట్టు టీమిండియా శిక్షణ శిబిరంలో ఉన్నప్పుడు అందుబాటులో ఉంటారు' అని వినోద్ రాయ్ వివరించారు.
గంగూలీ, సచిన్, లక్ష్మణ్‌లతో కూడిన క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రిని నియమిస్తూ ద్రవిడ్, జహీర్ ఖాన్‌లను కన్సల్టెంట్‌లుగా నియమించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఈ నిర్ణయం వివాదాస్పదం అవడం, రవిశాస్త్రి బౌలింగ్ కోచ్‌గా భరత్ అరుణ్ పేరుని తెరపైకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.

సహాయక సిబ్బందిని ఎంపిక చేసుకునే అధికారం కోచ్‌కే ఉంటుందని సీఓఏ కూడా స్పష్టం చేయడంతో భరత్ అరుణ్‌ని బీసీసీఐ బౌలింగ్ కోచ్‌గా ఎంపిక చేసింది. దీంతో ప్రస్తుతం కోహ్లీసేన శ్రీలంక పర్యటనలో ఉన్నా ద్రవిడ్ మాత్రం వెళ్లడం లేదు. త్వరలో దక్షిణాఫ్రికా పర్యటన కోసం భారత్ 'ఎ' జట్టుతో ద్రవిడ్ వెళ్లనున్నారు.
మరోవైపు బౌలింగ్ కన్సల్టెంట్‌గా జహీర్ నియామకానికి సంబంధించిన సమస్యలపై చర్చిస్తున్నామని తెలిపాడు. దక్షిణాఫ్రికా పర్యటనకు జహీర్ అందుబాటులో ఉండొచ్చని బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రీ చెప్పాడు. ఐపీఎల్ ఫ్రాంఛైజీకి పని చేస్తున్న జహీర్‌కు బౌలింగ్ కన్సల్టెంట్‌గా ఎలా కాంట్రాక్ట్ ఇవ్వాలనేదానిపై చర్చిస్తున్నామని తెలిపాడు.
'వివిధ భారత జట్లకు జహీర్ సేవలను ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతోనే ఉన్నాం. కానీ ముందు అతడికి కాంట్రాక్ట్ ఇవ్వాలి. ఐతే అతడికి వూరికే మూడు నెలల కాంట్రాక్ట్ ఇవ్వలేం. జహీర్ ఐపీఎల్ కాంట్రాక్ట్, మీడియా ఒప్పందాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవాలి' అని జోహ్రీ అన్నాడు.