
హైదరాబాద్: ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్ గెలిచిన యువ భారత్‌కు బీసీసీఐ భారీ నజరానాను ప్రకటించింది. న్యూజిలాండ్‌లోని మౌంట్ మాంగన్యూ వేదికగా జరిగిన ఫైనల్లో మన్‌జోత్ కల్రా సెంచరీతో రాణించడంతో భారత్ 8 వికెట్ల తేడాతో అలవోక విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే.

తాజా విజయంతో టీమిండియా నాలుగోసారి వరల్డ్ కప్‌ను గెలిచి చరిత్ర సృష్టించింది. అంతకముందు 2000, 2008, 2012లలో టీమిండియా అండర్-19 వరల్డ్ కప్ విజేతగా అవతరించింది. 2000లో మహ్మద్ కైఫ్ కెప్టెన్సీలో, 2008లో విరాట్ కోహ్లి కెప్టెన్సీలో, 2012లో ఉన్ముక్త్ చంద్ కెప్టెన్సీలో భారత్ విశ్వవిజేతగా నిలిచింది.
ఈ టోర్నీలో ఓటమే ఎరగని టీమిండియా ఫైనల్లో కూడా అద్భుత ప్రదర్శన కనబర్చారు. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 47.2 ఓవర్లలో 216 పరుగులు చేసి ఆలౌటైంది. అనంతరం 217 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 38.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 220 పరుగులు చేసింది.
కోచ్ ద్రవిడ్, యువ ఆటగాళ్లకు బీసీసీఐ నజరానా:
* రాహుల్ ద్రవిడ్, టీమిండియా హెడ్ కోచ్ - రూ. 50 లక్షలు
* జట్టులోని ఆటగాళ్లకు ఒక్కొక్కరికి రూ. 30 లక్షలు
* సపోర్టింగ్ స్టాఫ్ ఒక్కొక్కరికి రూ. 20 లక్షలు
అండర్-19 వరల్డ్ కప్ గెలిచిన భారత యువ జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ సందర్భంగా బీసీసీఐ పాలకుల కమిటీ ఛైర్మన్ వినోద్ రాయ్ మాట్లాడుతూ దేశాన్ని గర్వించేలా చేసిన అండర్-19 యువ జట్టుకు అభినందనలు తెలిపారు. మరోవైపు మాజీ క్రికెటర్లుతో పాటు ప్రస్తుత క్రికెటర్లు సైతం యువ జట్టుకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.