
హైదరాబాద్: నన్ను మోసం చేశారు కాపాడండి అంటూ భారత మాజీ క్రికెటర్, అండర్ 19 జట్టు కెప్టెన్ ద్రవిడ్ ఓ బెంగుళూరుకు చెందిన కంపెనీపై కేసు పెట్టారు. మార్చి 12న పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన ఓ న్యూస్ ఏజెన్సీకి చెప్పారు. విక్రమ్ ఇన్వెస్టిమెంట్స్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అదే కంపెనీలో రూ.20కోట్ల మేర పెట్టుబడులు పెట్టినట్లు ఆయన వెల్లడించారు.
కానీ రూ.16కోట్లు మాత్రమే వెనక్కి వచ్చాయని, ఇంకా ఆ కంపెనీ రూ.4కోట్లు ఎగ్గొట్టిందని ఆయన ఇందిరానగర్ పోలీసులకు ఇచ్చిన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ ఫిర్యాదును బనషంకరి పోలీసులకు ట్రాన్స్‌ఫర్ చేశారు. పోంజీ పథకంలో పెట్టుబడులు పెడితే 40శాతం రాబడి వస్తుందని ఆయన అన్నారు. అలాంటిది బెంగళూరులోని విక్రమ్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ పలువురు క్రీడాకారులను మోసం చేసి దాదాపు 800 మందిని రూ.500కోట్ల మేర మోసగించినట్లు తేలింది.
ఈ కంపెనీ యజమానులు రాఘవేంద్ర శ్రీనాథ్‌తో పాటు ఏజెంట్ సూత్రమ్ సురేశ్, నరసింహమూర్తి, కేజీ.నాగరాజ్, ప్రహ్లాద్‌ను బెంగళూరు పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. ఈ పోంజీ పథకంలో పెట్టుబడులు పెట్టి మోస పోయిన వారి జాబితాలో బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్, ప్రకాశ్ పదుకొణె కూడా ఉన్నారు. బాలాజీ అగరబత్తీ కంపెనీ యజమాని పీఆర్ బాలాజీ విక్రమ్ ఇన్వెస్ట్‌మెంట్‌పై ఫిర్యాదు చేయడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది.
పద్నాలుగు రోజుల్లో .. నిందితులను అదుపులోకి తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు. ఖాతాదారులకి రూ.300కోట్ల మేర నష్టానికి పాల్పడిన వారిపై తగు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.