హైదరాబాద్: బ్యాట్ సైజు తగ్గించాలంటూ ఐసీసీ విధించిన కొత్త నిబంధనలు ఆటపై కచ్చితంగా ప్రభావం చూపిస్తాయని భారత అండర్-19, ఏ జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్ అభిప్రాయపడ్డాడు. మంగళవారం ఢిల్లీలో భారత మహిళ జట్టు కెప్టెన్ మిథాలీరాజ్, పేసర్ జులన్ గోస్వామిలకు సన్మానం కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాహుల్ ద్రవిడ్ క్రికెట్‌లోకి వచ్చిన కొత్త రూల్స్‌లో ఏది ఎక్కువ ప్రభావం చూపబోతుందని అడిగిన ప్రశ్నకు గాను సమాధానమిచ్చాడు. మ్యాచ్‌ల ఫలితాలను కొత్త నిబంధనలు నిర్దేశిస్తాయని ద్రవిడ్ వ్యాఖ్యానించాడు. ముఖ్యంగా బ్యాట్ సైజు ప్రభావం ఆటపై కచ్చితంగా ఉంటుందన్నాడు.

'బ్యాట్ సైజ్‌లో మార్పులు ఆటపై ఎక్కువ ప్రభావం చూపనుంది. ఈ మార్పు కారణంగా మ్యాచ్ ఫలితాలే మారిపోయే అవకాశం ఉంది. ఐసీసీ కొత్త నిబంధన తీసుకురాకమునుపే చాలా మంది క్రికెటర్లు తమ బ్యాట్ సైజులో మార్పులు చేసుకున్నారు. కొద్దిమంది మాత్రం అలానే ఉండిపోయారు. వారు కూడా ఇప్పుడు మార్పులు చేసుకున్నారు' అని ద్రవిడ్ అన్నాడు.
ఐసీసీ కొత్త నిబంధనలు వచ్చిన తర్వాత భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని, ఆస్ట్రేలియా విధ్వంసక ఓపెనర్ డేవిడ్ వార్నర్ తమ బ్యాట్ సైజ్‌లో మార్పులు చేసుకున్నా సంగతి తెలిసిందే. ఐసీసీ కొత్త నిబంధనల ప్రకారం బ్యాట్ అంచు 40 మిల్లీ మీటర్లకి మించకూడదు.. మిగిలిన చోట్ల మందం 67 మిల్లీ మీటర్లకి మించకూడదు. ఈ నిబంధన వల్ల బ్యాట్, బంతి మధ్య సమతూకం ఉంటుందని ఐసీసీ భావిస్తోంది.