
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ 'వాల్' రాహుల్ ద్రవిడ్ గురువారం బీసీసీఐ ఎథిక్స్ అధికారి జస్టిస్ డీకే జైన్ ఎదుట హాజరయ్యారు. పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశమై ద్రవిడ్ వివరణ ఇచ్చారు. విచారణ సందర్భంగా అతడిని ఇండియా సిమెంట్స్ పదవి నుంచి తప్పుకోమని కోరే వీలున్నట్లు ముందుగా భావించారు. అయితే దీనికిముందే.. భారతీయ రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్‌ను ఉదాహరణగా చూపిస్తూ.. ద్రవిడ్‌పై విరుద్ధ ప్రయోజనాల అంశం తీవ్రతను తగ్గించేందుకు క్రికెట్ పాలకుల కమిటీ (సీఓఏ) చీఫ్ వినోద్ రాయ్ ఓ నోట్ పంపారు.
'ద్రవిడ్ ఎథిక్స్ అధికారి హాజరయ్యే ముందు సీఓఏ చీఫ్ వినోద్ రాయ్ ఓ నోట్ పంపారు. ఇండియా సిమెంట్స్‌లో ద్రవిడ్ వేతనం లేకుండా సెలవు తీసుకుంటే.. పరస్పర విరుద్ధ ప్రయోజనాల నిబంధన పరిధిలోకి రాడని పేర్కొన్నారు. చికాగో విశ్వవిద్యాలయం నుంచి సెలవు తీసుకొని ఆర్బీఐ గవర్నర్‌గా పనిచేసిన రఘురామ్ రాజన్, కొలంబియా విశ్వవిద్యాలయం నుంచి సెలవు తీసుకొని నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్‌గా పనిచేసిన అరవింద్ పనగడియా గురించి రాయ్ లేఖలో వివరించారు. వారిలాగానే ద్రవిడ్ కూడా ఇండియా సిమెంట్స్ నుంచి వేతనం తీసుకోకుండా ఉంటే.. విరుద్ధ ప్రయోజనాల కిందకు రాడని రాయ్ అభిప్రాయపడ్డాడు' అని బీసీసీఐలోని ఓ సీనియర్ అధికారి తెలిపారు.
సీఓఏ చీఫ్ వినోద్ రాయ్ లేఖ రాసినప్పటికీ.. ద్రవిడ్ పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశమై అంతిమ నిర్ణయం మాత్రం డీకే జైన్‌దే అని సదరు బీసీసీఐ అధికారి తెలిపారు. ఏదేమైనా మరింత స్పష్టత కోసం ఉద్యోగానికి రాజీనామా చేయాలని సూచించొచ్చని ఆ అధికారి పేర్కొన్నారు. ముంబై క్రికెట్ సంఘంతో పాటు మరో ఆరు క్లబ్బుల్లో ఓటింగ్ అధికారులున్న బీసీసీఐ అధికారి మయాంక్ పారిఖ్ సైతం డీకే జైన్ ఎదుట హాజరయ్యారు.
రాహుల్ ద్రవిడ్ ప్రస్తుతం ఎన్‌సీఏ డైరెక్టర్‌గా, ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యంలోని ఇండియా సిమెంట్స్ సంస్థ ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. దీంతో ద్రవిడ్ పరస్పర విరుద్ధ ప్రయోజనాల కిందకు వస్తాడని మధ్యప్రదేశ్ క్రికెట్ సంఘం శాశ్వత సభ్యుడు సంజీవ్ గుప్తా ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిపైనే ద్రవిడ్ వివరణ ఇచ్చారు. అయితే డీకే జైన్ ఇంకా తన నిర్ణయంను తెలపలేదు.