హైదరాబాద్: యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ని ఇస్తామంటే ఎవరైనా సంతోషంగా స్వీకరిస్తారు. కానీ బెంగుళూరు యూనివర్సిటీ తనకు ఇవ్వదల్చిన గౌరవ డాక్టరేట్‌ను భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ సున్నితంగా తిరస్కరించాడు. శుక్రవారం వర్సిటీ 52వ స్నాతకోత్సవం సందర్భంగా ద్రవిడ్‌కు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేయనున్నట్టు వీసీ తిమ్మగౌడ ప్రకటించారు.
అరుదైన గౌరవం: ద్రవిడ్‌కు డాక్టరేట్ ప్రదానం
అయితే ద్రవిడ్ మాత్రం అందుకు అంగీకరించలేదు. తనకు ఈ గౌరవం కల్పించాలని నిర్ణయించినందుకు ధన్యవాదాలు చెబుతూనే, క్రీడా రంగంలో ఏదైనా పరిశోధన చేయడం ద్వారా డాక్టరేట్ సంపాదించాలని కోరుకుంటున్నానని గౌరవ డాక్టరేట్ వద్దని వీసీకి ద్రవిడ్ చెప్పినట్టు వర్సిటీ వీసీ తిమ్మె గౌడ తెలిపారు.

టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించిన రాహుల్ ద్రవిడ్ ఇండోర్‌లో జన్మించినా... ఆయన విద్యాభ్యాసం మొత్తం బెంగుళూరులోనే జరిగింది. కర్ణాటక తరుపున జాతీయ జట్టుకు ప్రాతనిధ్యం వహించాడు. 2011-12 మధ్య భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నప్పుడు ద్రావిడ్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు.
కాగా, బెంగుళూరు యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకుంటున్న రెండో క్రికెటర్‌గా ద్రవిడ్ గుర్తింపు పొందాడు. 2013లో టీమిండియా మాజీ కెప్టెన్ గుండప్ప విశ్వనాథ్‌కు బెంగుళూరు యూనివర్సిటీ డాక్టరేట్ డిగ్రీని ప్రదానం చేసింది. ప్రస్తుతం ఇండియా ఏ, అండర్-19 టీమ్‌లకు అతను కోచింగ్ ఇస్తున్నాడు.