హైదరాబాద్: ఇండియా ఏ, అండర్-19 జట్టు కోచ్‌గా ఉన్న టీమిండియా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ పదవీ కాలాన్ని మరో రెండేళ్లు పొడిగిస్తూ బీసీసీఐ జూన్ 30 (శుక్రవారం) నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బీసీసీఐ అధికారిక ప్రకటన చేసింది.
2015లో పది నెలల పాటు ఇండియా ఏ, అండర్-19 జట్లకు కోచ్‌గా ఉండేందుకు బీసీసీఐ రాహుల్ ద్రవిడ్‌తో ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా, ద్రవిడ్ నేతృత్వంలోని ఇండియా ఏ, అండర్-19 జట్లు మెరుగైన ఫలితాలు సాధించడంతో ఈ ఒప్పందాన్ని మరో రెండేళ్లపాటు పొడిగిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.

కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ అద్భుతమైన ఫలితాలు రాబట్టాడు. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లతో జరిగిన ముక్కోణపు సిరిస్‌లో ఇండియా ఏ జట్టు అద్భుత విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. ఇక, 2016లో జరిగిన ఐసీసీ వరల్డ్ కప్ టోర్నీలో అండర్-19 జట్టు ఫైనల్ వరకు వెళ్లింది.
2015లో తొలుత చేసుకున్న 10 నెలల కోచ్ పదవికి గాను బీసీసీఐ రాహుల్ ద్రవిడ్‌కి సుమారు రూ.4 కోట్లను వేతనంగా ఇచ్చింది. తాజా ఒప్పందంతో ద్రవిడ్‌కి ఇంకా పెద్ద మొత్తంలో అందుతుంది. ద్రవిడ్ పదవీ కాలం పొడిగింపు విషయం జూన్ నెల మొదట్లో జరిగిన బీసీసీఐ జనరల్ బాడీ మీటింగ్‌లో కూడా చర్చకు వచ్చింది.
గంగూలీ, సచిన్, లక్ష్మణ్‌తో కూడిన బీసీసీఐ క్రికెట్ సలహా మండలి కూడా ద్రవిడ్ పదవీ కాలాన్ని పొడిగించేందుకు అంగీకారం తెలిపింది.ఇదిలా ఉంటే ఇండియా ఏ జట్టు మరికొన్ని రోజుల్లో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా ఇండియా ఏ జట్టు వన్డే మ్యాచ్‌లతో పాటు నాలుగు రోజుల టెస్టు మ్యాచ్‌లను ఆడనుంది.
ఈ జట్లకు కెప్టెన్లుగా సీనియర్ ఆటగాళ్లు కరుణ్ నాయర్, మనీష్ పాండేలు ఎంపికయ్యారు. ఆతిథ్య దక్షిణాఫ్రికా ఏ రెండు అనధికార టెస్టులకు కరుణ్ నాయర్‌కు కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించగా, వన్డే జట్టు కెప్టెన్‌గా మనీష్ పాండే వ్యవహరించనున్నాడు. ఈ పర్యటనలో ఇండియా ఏ జట్టుతో పాటు ఆస్ట్రేలియా ఏ జట్టు కూడా పాల్గొంటుంది.
జులై 26వ తేదీన ఆస్ట్రేలియా ఏ జట్టుతో భారత్ జట్టు తలపడే మ్యాచ్‌తో ముక్కోణపు వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఇలా మూడు దేశాల ముక్కోణపు వన్డే సిరిస్ ఆగస్టు 8వరకు జరుగుతుంది. మరోవైపు జులైలో అండర్ 19 జట్టు కూడా ఇంగ్లండ్ వెళ్లనుంది. అయితే రాహుల్ ద్రవిడ్ ఏ జట్టుతో టూర్‌కు వెళ్లేది మాత్రం ఇంకా స్పష్టం కాలేదు.