హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్, ప్రస్తుత భారత్ ఏ జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు అరుదైన గౌరవం లభించింది. క్రికెట్‌కు రాహుల్ ద్రవిడ్ చేసిన సేవలకు గుర్తింపుగా బెంగుళూరు యూనివర్సిటీ జనవరి 27వ తేదీన డాక్టరేటు ప్రదానం చేయనుంది.
యూనివర్సిటీ 52వ స్నాతకోత్సవాన్ని పురస్కరించుకుని ద్రవిడ్‌కు డాక్టరేటు అందజేస్తున్నట్లు వర్సిటీ వైస్ ఛాన్సలర్ దిమ్మె గౌడ్ తెలిపారు. ఈ ఏడాది డాక్టరేటు ఒక్కరికే ప్రదానం చేస్తున్నామని, దీనిపై రాహుల్ తల్లి పుష్పతో సంప్రదించినట్లు గౌడ్ చెప్పారు.

రాహుల్ ద్రవిడ్ తల్లి పుష్ప బెంగుళూరు యూనివర్సిటీలోని విశ్వేశ్వరయ్య కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్‌లో ప్రొఫెషర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. కాగా, ద్రవిడ్‌కు డాక్టరేట్ ఇస్తున్న రెండో యూనివర్సిటీ ఇది. 2014లో గుల్బర్గా వర్సిటీ నుంచి ద్రవిడ్ డాక్టరేటు అందుకున్నారు.
జనవరి 11న ఇండోర్‌లో జన్మించిన రాహుల్ ద్రవిడ్ తన విద్యాభ్యాసాన్ని బెంగుళూరులోనే పూర్తి చేయడం విశేషం. కర్ణాటక తరుపున జాతీయ జట్టుకు ప్రాతనిధ్యం వహించాడు. 2011-12 మధ్య భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నప్పుడు ద్రావిడ్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు.
కాగా, బెంగుళూరు యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకుంటున్న రెండో క్రికెటర్‌గా ద్రవిడ్ గుర్తింపు పొందాడు. 2013లో టీమిండియా మాజీ కెప్టెన్ గుండప్ప విశ్వనాథ్‌కు బెంగుళూరు యూనివర్సిటీ డాక్టరేట్ డిగ్రీని ప్రదానం చేసింది.