హైదరాబాద్: అత్యంత నాటకీయ పరిణామాల మధ్య టీమిండియా కోచ్‌గా రవిశాస్త్రిని ఎంపిక చేసినట్లు బీసీసీఐ మంగళవారం రాత్రి ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో కెప్టెన్ కోహ్లీ కోరిక నెరవేరింది. 2016లో జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో వైఫల్యంతో టీమిండియా డైరెక్టర్ పదవి నుంచి తప్పించిన రవిశాస్త్రినే మళ్లీ కుంబ్లే వారసుడిగా నియమించారు.
రవిశాస్త్రితో పాటు జహీర్ ఖాన్, రాహుల్ ద్రవిడ్‌కు కూడా బీసీసీఐ కొత్త బాధ్యతలు కట్టబెట్టింది. 2019 వరల్డ్ కప్ లక్ష్యంగా జరిగిన ఈ ఎంపికలో టీమిండియా ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రి బాధ్యతలు నిర్వర్తించనుండగా, జహీర్ ఖాన్ బౌలింగ్ కోచ్ బాధ్యతలు చేపట్టనున్నాడు. బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా రాహుల్ ద్రవిడ్ వ్యవహరిస్తాడు.

రాహుల్ ద్రవిడ్‌ను విదేశీ పర్యటనల కోసం టీమిండియా బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా నియమించారన్న వార్త బయటకు రాగానే, ప్రస్తుతం బ్యాటింగ్ కోచ్‌గా ఉన్న బంగర్‌పై వేటు పడినట్లే అని అంతా భావించారు. అయితే బంగర్‌ను కూడా ఆ పదవిలో అలాగే బీసీసీఐ కొనసాగించడం విశేషం. కేవలం కీలకమైన విదేశీ పర్యటనల సమయంలో మాత్రమే ద్రవిడ్ అందుబాటులో ఉంటాడని పేర్కొంది.
ఇక ప్రస్తుతం బ్యాటింగ్ కోచ్‌గా ఉన్న సంజయ్ బంగర్ మాత్రం ఎప్పుడూ జట్టుతో కొనసాగుతాడు. సోమవారమే ఇంటర్వ్యూలు పూర్తయినా సీఏసీ కోచ్ నియామకాన్ని సీఏసీ నిలిపి ఉంచిన సంగతి తెలిసిందే. కెప్టెన్ కోహ్లీతో మాట్లాడి, నిర్ణయాన్ని వెల్లడిస్తామని, కోచ్ ఎంపికకు కొన్ని రోజుల సమయం పడుతుందని గంగూలీ చెప్పిన సంగతి తెలిసిందే.
అయితే బీసీసీఐ పరిపాలనా కమిటీ ఛైర్మన్ వినోద్ రాయ్ మంగళవారం సాయంత్రం లోపు కొత్త కోచ్ పేరు ప్రకటించాలని ఆదేశించింది. దీంతో కెప్టెన్ కోహ్లీతో పాటు ఆటగాళ్లు కూడా కోరుకుంటున్న నేపథ్యలో రవిశాస్త్రిని ప్రధాన కోచ్‌గా నియమించినట్లు తెలుస్తోంది. 2019 వరల్డ్ కప్ వరకు కొత్త కోచ్‌లు తమ పదవుల్లో కొనసాగుతారు.