ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్ కప్పే టీమిండియా హెడ్ కోచ్‌గా తన చివరి టోర్నమెంట్ అని రాహుల్ ద్రవిడ్ అధికారికంగా ప్రకటించాడు. పొట్టి కప్‌లో న్యూయార్క్ వేదికగా బుధవారం ఐర్లాండ్‌తో భారత్ తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ద్రవిడ్ మాట్లాడాడు. ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
భారత జట్టు కోచ్ పదవికి మరోసారి దరఖాస్తు చేయాలనుకోవట్లేదని ద్రవిడ్ తెలిపాడు. టీమిండియా షెడ్యూల్స్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నాని వివరించాడు. అయితే కోచ్ బాధ్యతలను ఎంతగానో ఆస్వాదించానని పేర్కొన్నాడు. భారత్ తరఫున కోచ్‌గా సేవలందించిన ప్రతీ టోర్నీ తనకి ముఖ్యమైనవే అని అన్నాడు. టీ20 వరల్డ్ కప్ కూడా అలాంటిదే అని, ప్రత్యేకత టోర్నీఅంటూ ఏమీ లేదని అన్నాడు.

అయితే ఈ మెగాటోర్నీనే కోచ్‌గా తనకి చివరిదని రాహుల్ ద్రవిడ్ అన్నాడు. టాలెంటెడ్ ప్లేయర్స్‌తో కలిసి పనిచేయడం సంతోషాన్ని ఇచ్చిందని పేర్కొన్నాడు. ఇక టీ20 వరల్డ్ కప్‌లో జట్టు కూర్పు గురించి మాట్లాడుతూ రోహిత్ శర్మ- యశస్వీ జైస్వాల్ జోడీనే తమ మొదటి ప్రాధాన్యత అని చెప్పుకొచ్చాడు. అలాగే విరాట్ కోహ్లి కూడా ఓపెనర్‌గా బరిలోకి దిగే అవకాశాలూ ఉన్నాయని అన్నాడు.
కాగా, ద్రవిడ్ స్థానంలో టీమిండియా కొత్త కోచ్ పదవి ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ నెలకొంది. ద్రవిడ్ వారసుడిగా గౌతమ్ గంభీర్ కోచ్ బాధ్యతలు అందుకుంటాడని ప్రచారం జోరుగా సాగుతోంది. తొలుత కోచ్ పదవి రేసులో వీవీఎస్ లక్ష్మణ్ పేరు వినిపించింది. కానీ ఈ పదవిపై లక్ష్మణ్ ఆసక్తి చూపలేదు. ఆ తర్వాత విదేశీ క్రికెటర్లు రికీ పాంటింగ్, జస్టిన్ లాంగర్‌లలో ఒకరు కోచ్‌గా ఎంపిక అవుతారని కథనాలు వచ్చాయి.
కానీ భారత దేశవాళీ క్రికెట్‌పై లోతైన అవగాహన ఉన్నవాళ్లకే కోచ్ పదవికి ప్రాధాన్యత ఇస్తామని బీసీసీఐ కార్యదర్శి జై షా పేర్కొన్నడం విదేశీ ప్లేయర్ కోచ్ వార్తలకు బ్రేక్ పడింది. తాజాగా గంభీర్ చేసిన వ్యాఖ్యలతో కొత్త కోచ్ అతనే అని తెలుస్తోంది. 140 కోట్ల మంది భారతీయుల తరఫున ఆడే టీమిండియాకు కోచ్ బాధ్యతలు నిర్వర్తించడానికి మించిన మరో అరుదైన గౌరవం ఉండదని గంభీర్ పేర్కొన్నాడు. దీంతో గంభీర్ ఎంపిక ఖరారైందని ప్రచారం జోరుగా సాగుతోంది. టీమిండియా కొత్త కోచ్ 2027 డిసెంబర్ 31 వరకు బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది.