IND vs ENG: బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ మహిళల జట్ల మధ్య జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో టీమిండియా పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో ఓపెనర్ షఫాలీ వర్మ 41 బంతుల్లో 13 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 75 పరుగులు చేసింది. షఫాలీతో పాటు రిచా ఘోష్ 24 పరుగులతో రాణించింది. స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన(8), జెమీమా రోడ్రిగ్స్(1), కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(15) నిరాశపరిచారు. ఇంగ్లండ్ బౌలర్లలో చార్లీ డీన్ 3 వికెట్లు పడగొట్టగా.. ఎకిలిస్టోన్ 2 వికెట్లు, లిన్సీ స్మిత్, ఎమ్ ఆర్లాట్ తలో వికెట్ సాధించారు.
అనంతరం 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు 5 వికెట్లు కోల్పోయి ఆఖరి బంతికి విజయం సాధించింది. ఇంగ్లండ్ ఓపెనర్లు సోఫియా డంక్లీ(46), డేనియల్ వ్యాట్-హాడ్జ్(56) అద్భుతమైన ఆరంభాన్ని అందించగా.. టామీ బ్యూమాంట్(30) వారితో పాటు రాణించింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ, అరుంధతి రెడ్డి తలో 2 వికెట్లు సాధించారు. చివరి టీ20లో భారత్ ఓటమిపాలైనప్పటికీ.. తొలుత 3 మ్యాచ్‌లు గెలవడంతో సిరీస్‌ను 2-3 తేడాతో టీమిండియా సొంతం చేసుకుంది.

రాధా యాదవ్ అద్భుతమైన క్యాచ్
చివరి మ్యాచ్‌లో భారత్ ఓడిపోయినప్పటికీ రాధా యాదవ్ పట్టిన ఒక అద్భుతమైన క్యాచ్ చాలా వైరల్‌గా మారింది. వికెట్ తీయడానికి ఆమె టీమిండియాకు సూపర్ ఉమెన్‌గా మారిపోయింది. రాధా యాదవ్ భారత మహిళా క్రికెట్ జట్టులోని అత్యుత్తమ ఫీల్డర్లలో ఒకరు. ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌లో ఆమె దీనిని మరోసారి నిరూపించింది. 20వ ఓవర్లో అరుంధతి రెడ్డి బౌలింగ్ చేస్తున్నప్పుడు మూడో బంతికి ఇంగ్లీష్ బ్యాటర్ అమీ జోన్స్ షాట్ కొట్టగా.. బంతి గాలిలోకి లేచింది. రాధా యాదవ్ గాలిలోకి డైవ్ చేసి అద్భుతమైన క్యాచ్ పట్టింది. సాధారణంగా ఇలాంటి క్యాచ్‌లను ల్యాండ్ చేసేటప్పుడు జారవిడుస్తారు. కానీ రాధా బంతిని పట్టుకుంది. ఈ వీడియో ప్రస్తుతం తీవ్రంగా వైరల్ అవుతోంది.