టెస్టుల్లో 500 వికెట్ల మార్క్‌ను అందుకున్న టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కొనియాడాడు. రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో క్రాలేను ఔట్ చేసి టెస్టు క్రికెట్‌లో అశ్విన్ 500వ వికెట్ అందుకున్న విషయం తెలిసిందే. టెస్టుల్లో 500 వికెట్లు వేగంగా తీసిన భారత బౌలర్‌గా చరిత్రకెక్కాడు. అంతేగాక బంతుల పరంగా వేగంగా ఈ ఘనత సాధించిన రికార్డులో భారత్ తరఫున అగ్రస్థానంలో, ప్రపంచ వ్యాప్తంగా రెండో స్థానంలో అశ్విన్ నిలిచాడు.
ఈ నేపథ్యంలో అశ్విన్ గురించి సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ''రవిచంద్రన్ అశ్విన్ 500 వికెట్లు సాధించినందుకు అభినందనలు. అతడు అద్భుతమైన ఆటగాడు. అతడో క్రికెట్ చాణుక్యుడు. కొత్తగా, భిన్నంగా సాధించడానికి ఎల్లప్పుడూ ప్రయత్నిస్తుంటాడు. రన్‌అప్, డెలివరీ యాక్షన్‌లో కొత్తగా ట్రై చేస్తూ బ్యాటర్లకు తీవ్ర ఇబ్బందులు గురిచేస్తుంటాడు''

''అయితే గత కొన్నేళ్ల క్రితమే అతడికి టీమిండియా కెప్టెన్సీ పగ్గాలు అందించి అతడిని గౌరవించాల్సింది. రెండు సంవత్సరాల క్రితం ఓ సందర్భంలో విదేశీ పర్యటనల నేపథ్యంలో భారత రెండు జట్లు ఒకే సమయంలో ఆడాయి. అప్పుడు ఓ జట్టును అశ్విన్ నేతృత్వంలో ఆడించాల్సింది'' అని సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు.
2021లో ఇంగ్లండ్, శ్రీలంక పర్యటనల వరుసగా ఉన్నాయి. దీంతో యువకులతో ఉన్న భారత జట్టు లంక పర్యటనకు వెళ్లగా, సీనియర్ల జట్టు ఇంగ్లండ్‌కు వెళ్లింది. ఆ సందర్భంలో ఎన్నో ఘనతలు సాధించిన అశ్విన్‌కు కెప్టెన్ బాధ్యతలు అందించి గౌరవించాల్సిందని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. కాగా, ఇటీవల జరిగిన రాజ్‌కోట్ టెస్టులో అశ్విన్ మూడో రోజు ఆటకు దూరమైన విషయం తెలిసిందే.
తన తల్లి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రత్యేక అనుమతితో అశ్విన్ చెన్నైకి వెళ్లాడు. అక్కడ పరిస్థితి సద్దుమణగడంతో తిరిగి రాజ్‌కోట్‌కు వచ్చాడు. నాలుగో రోజు ఆటలో బరిలోకి దిగి ఒక వికెట్ కూడా పడగొట్టాడు. అయితే అశ్విన్ త్వరగా టీమిండియాతో చేరడం కోసం బీసీసీఐ ప్రత్యేక విమానాన్ని సిద్ధం చేసిందని సమాచారం. దాంతో వెంటనే చెన్నై నుంచి రాజ్‌కోట్‌కు వెంటనే చేరుకుని నాలుగో రోజు రెండో సెషన్‌కు అశ్విన్ అందుబాటులొకి వచ్చాడు. కాగా, రాంచీ వేదికగా శుక్రవారం నుంచి భారత్-ఇంగ్లండ్ నాలుగో టెస్టు ప్రారంభం కానుంది.