హైదరాబాద్: గాలే వేదికగా ఆతిథ్య శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో కోహ్లీసేన 304 పరుగుల తేడాతో ఘన విజయం సాధించడంతో ఐసీసీ ప్రకటించిన తాజా ర్యాంకుల్లో భారత ఆటగాళ్లు తమ ర్యాంకులను మెరుగుపరచుకున్నారు.
మంగళవారం ఐసీసీ ప్రకటించిన టెస్టు ర్యాంకుల్లో భారత స్పిన్నర్లు తొలి రెండు స్ధానాల్లో నిలిచారు. టెస్టుల్లో టాప్ బౌలర్ల జాబితాలో రవీంద్ర జడేజా అగ్రస్ధానంలో నిలవగా, రవిచంద్రన్ అశ్విన్ రెండోస్థానంలో ఉన్నారు.
ఇక బ్యాట్స్‌మెన్ల విషయానికి వస్తే పుజారా నాలుగో స్ధానంలో నిలవగా, కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐదో స్ధానంలో నిలిచారు. లంకతో జరిగిన తొలి టెస్టులో ఈ ఇద్దరూ సెంచరీలు చేయడం విశేషం. గాలే టెస్టులో సెంచరీతో చెలరేగిన ఓపెనర్ శిఖర్ ధావన్ 21 స్ధానాలు ఎగబాకి 39వ స్ధానంలో నిలిచాడు.
ఇక శ్రీలంక ఆల్ రౌండర్ ఏంజెలో మాథ్యూస్ రెండు స్ధానాలు ఎగబాకి 17వ స్ధానంలో నిలిచాడు. గాలే టెస్టులో మాథ్యూస్ 83 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఇక టెస్టు జట్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా నెంబర్ వన్ స్థానంలోనే కొనసాగుతోంది.