హైదరాబాద్: టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన కళ్లను దానం చేయడానికి అంగీకరించాడు. ఈ మేరకు చెన్నైలోని రాజన్ ఐకేర్ హాస్పిటల్‌లో నేత్రదానంపై నిర్వహించిన అవగాహన ప్రచార సభలో పాల్గొన్నాడు. అనంతరం తన కళ్లను దానం చేస్తూ అంగీకార పత్రంపై సంతకం చేశాడు.
'నా కళ్లను సంతోషంగా దానం చేస్తున్నా. మరి మీరో?' అంటూ రవిచంద్రన్ అశ్విన్ అంగీకార పత్రంలో ఓ స్లోగన్ రాశాడు. ఈ కార్యక్రమంలో రాజన్ ఐకేర్ హాస్పిటల్ చైర్మన డాక్టర్ మోహనరాజన్, తమిళ సినీ హాస్యనటుడు వైజీ మహేంద్రన్, శ్రీమతి వైజీపి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా క్రికెటర్ అశ్విన్ మీడియాతో మాట్లాడుతూ నేత్రదానం చేయాలని తన భార్య ప్రీతి ఎప్పటి నుంచో చెబుతూ వచ్చిందనీ, ఇన్నాళ్లకు ఆమె కోరిక నెరవేరిందని అన్నాడు. తన అభిమానులు నేత్ర దానం చేయడానికి ముందుకు రావాలని ఈ సందర్భంగా అశ్విన్ పిలుపునిచ్చాడు.
ఇదిలా ఉంటే ఐసీసీ ప్రకటించిన టెస్టు ర్యాంకుల్లో అశ్విన్ తన నెంబర్ వన్ స్ధానాన్ని నిలుపుకున్నాడు. ఐసీసీ విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్‌లో అశ్విన్ తొలి స్థానంలో నిలవగా, మరో స్పిన్నర్ రవీంద్ర జడేజా రెండో స్థానంలో ఉన్నాడు. 887 రేటింగ్ పాయింట్లతో అశ్విన్, 879 రేటింగ్ పాయింట్లతో జడేజా తొలి రెండు స్ధానాల్లో నిలిచారు.
ఆస్ట్రేలియా పేసర్ హజెల్ ఉడ్ 860 పాయింట్లతో మూడో స్ధానంలో నిలిచాడు. ఇటీవల పాకిస్థాన్‌తో ముగిసిన టెస్టు సిరిస్‌లో 29 పాయింట్లను తన ఖాతాలో వేసుకున్న ఉడ్ తన ర్యాంకుని మరింతగా మెరుగుపర్చుకున్నాడు. ఇక టీమిండియా బౌలర్ మహ్మద షమీ ఈ జాబితాలో 19వ స్ధానాన్ని దక్కించుకున్నాడు.
ఇదిలా ఉండగా, టెస్టుల్లో బ్యాటింగ్ విభాగంలో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ తొలి స్థానంలో ఉండగా, భారత కెప్టెన్ విరాట్ కోహ్లి రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.