
ఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి సెకండ్ వేవ్ ప్రభావం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021పై పడుతోంది. ఆటగాళ్లు, సిబ్బంది కరోనా బారిన పడకుండా ఉండటానికి బయో బుడగలను ఏర్పాటు చేసి కఠిన నిబంధనలను అమలు చేస్తూ మ్యాచ్‌లు నిర్వహిస్తున్నా.. ఇప్పటికే ఐదు మంది ఆటగాళ్లు, ఇద్దరు అంపైర్లు ఐపీఎల్ 14వ సీజన్ నుంచి తప్పుకున్నారు. అయితే కొంతమంది వ్యక్తిగత కారణాలతో లీగ్ నుంచి వైదొలుగుతుంటే.. మరికొంత బుడగలో ఉండలేక ఇంటిదారి పడుతున్నారు.
రవిచంద్రన్ అశ్విన్, లివింగ్ స్టోన్, ఆడమ్ జంపా, కేన్ రిచర్డ్‌సన్, ఆండ్రూ టై ఇప్పటికే ఐపీఎల్ లీగ్ నుంచి వైదొలిగారు. భారత్‌కు చెందిన అంపైర్ నితిన్ మీనన్‌తో పాటు ఆస్ట్రేలియాకు చెందిన పాల్ రీఫెల్ టోర్నీ నుంచి నిష్క్రమించారు. ఇక ఆటగాళ్లు ఉంటున్న బయోబుడగలు సురక్షితం కావని, గతేడాది మాదిరిగా ఈ సారి కూడా ఐపీఎల్‌ను యూఏఈలో నిర్వహిస్తే బాగుండేదని ఇటీవల ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జంపా అన్నాడు. అనంతరం తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ముంబై ఇండియన్స్ ఆటగాడు క్వింటన్ డికాక్ బయో బుడగపై స్పందించాడు.
బయోబబుల్, ఆటగాళ్లను పర్యవేక్షించే వైద్యులపై పూర్తి నమ్మకం ఉందని, ఐపీఎల్ 2021 నుంచి వైదొలగాలనే ఆలోచనలు లేవని క్వింటన్ డికాక్ అన్నాడు. 'నిజం చెప్పాలంటే మేం మా వైద్యులపై, బీసీసీఐపై నమ్మకం ఉంచాం. మా బయో బుడగలో మేం చాలా సురక్షితంగా ఉన్నాం. జాగ్రత్తలు తీసుకుంటున్నాం. నేను సురక్షితంగానే ఉన్నా. ఇతర ఆటగాళ్ల గురించి నాకు తెలీదు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. ఎలాంటి ఆందోళన లేకుండా నమ్మకంతో ఉంటే ఆటలో రాణించవచ్చు' అని డికాక్ పేర్కొన్నాడు.
భారత్‌లో వైరస్ విజృంభిస్తుండడంతో ఐపీఎల్ 2021లో అలజడి రేగుతున్నది. మహమ్మారి విజృంభిస్తుండడంతో విదేశీ ఆటగాళ్లు భయపడుతున్నారు. ఇప్పటికే కొందరు ఈ సీజన్ నుంచి తప్పుకోగా.. మరికొందరు అదే బాట పట్టాలని భావిస్తున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో బీసీసీఐ స్పందించింది. మే 30న టోర్నీ ముగిశాక ఆటగాళ్లను వారి స్వదేశాలకు సురక్షితంగా చేరుస్తామని మంగళవారం హామీ ఇచ్చింది. ప్లేయర్లు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రకటించింది. ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఇళ్లకు చేరుకున్నాకే టోర్నీ ముగిసినట్టు అని బీసీసీఐ పేర్కొంది.