ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో కీలక సమరానికి సిద్ధమైంది. ఫైనల్ బెర్తు కోసం అహ్మదాబాద్ వేదికగా క్వాలిఫయిర్-1లో ఇవాళ కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు టైటిల్ పోరుకు నేరుగా అర్హత సాధిస్తుంది. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో మే 26న జరిగే ఫైనల్‌కు క్వాలిఫై అవుతుంది.
పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన కేకేఆర్ ఈ సీజన్‌లో కేవలం మూడు మ్యాచ్‌ల్లోనే ఓడింది. తొమ్మిదింట్లో గెలిచి 20 పాయింట్లు, మెరుగైన రన్‌రేటు సాధించింది. మరోవైపు సన్‌రైజర్స్ మాత్రం అయిదింట్లో పరాజయాన్ని చవిచూసింది. ఎనిమిది మ్యాచ్‌ల్లో నెగ్గి 17 పాయింట్లతో సెకండ్ ప్లేస్‌తో లీగ్ దశను ముగించింది. దీంతో సమవుజ్జీల మధ్య పోరు హోరాహోరీగా సాగడం ఖాయంగా అనిపిస్తోంది.

కాగా, ఈ మ్యాచ్‌లో కేకేఆర్‌ను చిత్తుగా ఓడిస్తే సన్‌రైజర్స్ హైదరాబాద్ నేరుగా ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ ఓడినా కూడా తుదిపోరుకు చేరుకోవడానికి ఎస్‌ఆర్‌హెచ్‌కు అవకాశాలు ఉన్నాయి. అయితే ఇవాళ మ్యాచ్‌లో ఓడితే శుక్రవారం జరగనున్న క్వాలిఫయిర్-2లో హైదరాబాద్ జట్టు పోరాడాల్సి ఉంటుంది. అహ్మదాబాద్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- రాజస్థాన్ రాయల్స్ మధ్య రేపు జరిగే మ్యాచ్‌లో విజేతతో ఎస్‌ఆర్‌హెచ్ క్వాలిఫయిర్-2లో తలపడాల్సి ఉంటుంది.
అయితే క్వాలిఫయిర్-2లో గెలిస్తే సన్‌రైజర్స్ ఫైనల్‌కు చేరుకోవచ్చు. ఒకవేళ ఈ పోరులో మాత్రం ఓడితే ఎస్‌ఆర్‌హెచ్ ఇంటిముఖం పట్టాల్సిందే. మరో అవకాశం ఉండదు. ఇక ప్లేఆఫ్స్ మ్యాచ్‌ల్లో నెట్ రన్ రేటును (NRR)ను ఎలాంటి పాత్ర పోషించదు. కాబట్టి క్వాలిఫయిర్-1లో భారీ తేడాతో ఓడినా ఎస్ఆర్‌హెచ్/కేకేఆర్‌పై ఎలాంటి ప్రభావం చూపదు. ఫైనల్ కోసం రెండో క్వాలిఫయిర్‌లో గెలిస్తే సరిపోతుంది.
ఒకవేళ క్వాలిఫయిర్-1,2, ఎలిమినేటర్ మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దు అయితే రిజర్వ్ డే రోజు మ్యాచ్‌లు నిర్వహిస్తారు. అయితే రిజర్వ్‌డే రోజు కూడా మ్యాచ్ నిర్వహించడం సాధ్యం కాకపోతే పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానంలో ఉన్న జట్టును విన్నర్‌గా ప్రకటిస్తారు.