హైదరాబాద్: రియో ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు ఆదివారం తాను సాధించిన కొరియా ఓపెన్ సూపర్ సిరిస్ టైటిల్‌ని ప్రధానమంత్రి నరేంద్రమోడీకి అంకితమిచ్చింది. ఈ మేరకు ట్విట్టర్‌లో ట్వీట్ చేసింది. ఆదివారం ఉత్కంఠభరితంగా సాగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ఐదో సీడ్ సింధు 22-20, 11-21, 20-18తో 8వ సీడ్ ఒకుహరా (జపాన్)పై విజయం సాధించిన సంగతి తెలిసిందే.
తద్వారా కొరియా ఓపెన్ గెలిచిన తొలి భారత షట్లర్‌గా పీవీ సింధు చరిత్ర సృష్టించింది. అంతేకాదు సింధు కెరీర్‌లో ఇది మూడో సూపర్ సిరీస్ టైటిల్. గతంలో చైనా ఓపెన్, ఇండియా ఓపెన్‌లలో సింధు విజేతగా నిలిచింది. ఈ నేపథ్యంలో తాజాగా కొరియా ఓపెన్ గెలిచిన సింధుకు ప్రధాని మోడీ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.
'కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ గెలిచిన సింధుకు అభినందనలు. ఆమె విజయం దేశానికి గర్వకారణం' అని మోడీ పేర్కొన్నారు.
మోడీ ట్వీట్‌కు పీవీ సింధు స్పందించింది. 'ప్రధాని మోడీ పుట్టినరోజు నాడు సాధించిన ఈ విజయాన్ని ఆయనకే అంకితమిస్తున్నాను. ఏ మాత్రం అలసిపోకుండా దేశానికి ఆయన అందిస్తోన్న సేవలు చిరస్మరణీయం.' అని సింధు ట్విటర్‌లో పేర్కొంది.
కాగా కొరియా ఓపెన్ అనంతరం సింధు కోచ్ గోపీచంద్ మాట్లాడుతూ ఎటాకింగ్‌పైనే దృష్టి సారించామని తెలిపారు. 'గ్లాస్కో వేదికగా జరిగిన వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో చేసిన తప్పులను సవరించాం. ఎటాకింగ్‌పై మరింతగా దృష్టిసారించాం. వచ్చేవారం జపాన్ ఓపెన్ ఉంది. డెన్మార్క్, ఫ్రాన్స్, చైనా, హాంకాంగ్ టోర్నీలు ఉన్నాయి. దుబాయ్ సూపర్ సిరీస్ ఫైనల్స్‌కు ముందు ఒక్కో టోర్నీపై దృష్టిసారిస్తాం' అని అన్నారు.