తమిళనాడుకు చెందిన యువ స్పిన్నర్ ఆర్ సాయి కిషోర్ టీమిండియా సెలక్టర్లకు ఓపెన్ ఛాలెంజ్ విసిరాడు. ప్రస్తుతం దేశంలో అత్యుత్తమ స్పిన్నర్లలో తాను ఒక్కరినని, ఒక్కసారి ఎంపిక చేసి చూడాలని అన్నాడు. అవకాశం ఇస్తే అద్భుత ప్రదర్శన చేస్తానని పేర్కొన్నాడు. వచ్చే నెలలో స్వదేశంలో బంగ్లాదేశ్‌తో భారత్ రెండు టెస్టుల సిరీస్ ఆడనున్న విషయం తెలిసిందే.
బంగ్లా సిరీస్ ఎంపిక తనని కూడా పరిగణించాలని సాయి కిషోర్ కోరాడు. ఐపీఎల్‌లో కిషోర్ గుజరాత్ టైటాన్స్ తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. గతంలో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడాడు. కాగా, మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న దులీప్ ట్రోఫీలో టీమ్-బీ తరఫున ఆడనున్న ఈ యువ స్పిన్నర్ కీలక వ్యాఖ్యలు చేశాడు.

''దేశంలో అత్యుత్తమ స్పిన్నర్లలో నేను ఒక్కరినిగా భావిస్తున్నా. ఓ టెస్టు మ్యాచ్‌లో ఆడే అవకాశం ఇవ్వండి. నేను సిద్ధంగా ఉన్నా. దేని గురించి ఆందోళన చెందట్లేదు. ఇక దులీప్ ట్రోఫీలో రవీంద్ర జడేజాతో కలిసి ఆడనున్నాను. సీఎస్కేలో కలిసి జడేజాతో ఆడాను. కానీ రెడ్ బాల్ క్రికెట్ కలిసి ఆడేలేదు. ఇప్పుడు అతనితో కలిసి ఆడుతూ మరికొన్ని విషయాలు నేర్చుకోవచ్చు. ఇక గతంలో కంటే నేను మరింత సిద్ధంగా ఉన్నాను'' అని సాయి కిషోర్ పేర్కొన్నాడు.
సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానున్న బంగ్లాదేశ్ టెస్టు సిరీస్ ఎంపిక దులీప్ ట్రోఫీ కీలకం కానుంది. ఈ ట్రోఫీలో సత్తాచాటిన ఆటగాళ్లకు సెలక్టర్లు భారత జట్టులో అవకాశం ఇవ్వనున్నారు. కాగా, సెప్టెంబర్ 5 నుంచి జరగనున్న ఈ దేశవాళీ టోర్నీలో నాలుగు జట్లు పోటీపడనున్నాయి. టీమ్-ఏకు శుభ్‌మన్ గిల్, బీ-కి అభిమన్యు ఈశ్వరన్, అలాగే సీకి రుతురాజ్ గైక్వాడ్, డీ జట్టుకు శ్రేయస్ అయ్యర్ సారథి బాధ్యతలు నిర్వర్తించున్నారు.
ఆర్ సాయి కిషోర్ టీమ్-బీలో ఉన్నాడు. రవి కిషోర్‌తో పాటు స్పిన్నర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, రాహుల్ చాహర్ కూడా ఉన్నారు. ఇక రిషభ్ పంత్, సర్ఫరాజ్ ఖాన్, మహ్మద్ సిరాజ్, ముకేష్ కుమార్, యశస్వీ జైస్వాల్ వంటి స్టార్ ప్లేయర్లు బీ జట్టులో ఉన్నారు. తెలుగు తేజం నితీశ్ కుమార్ రెడ్డి కూడా టీమ్-బీలోనే ఉన్నాడు.