ఐపీఎల్ 2026లో సీఎస్కేపై సాధించిన విజయానంతరం పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ జట్టు ఆటతీరుపై హర్షం వ్యక్తం చేశాడు. ముఖ్యంహా ఇన్నింగ్స్ ఆరంభంలో తమ ఓపెనర్లు అందించిన అసాధారణమైన ప్రారంభమే గెలుపులో కీలక పాత్ర పోషించిందని శ్రేయస్ అయ్యర్ కొనియాడాడు. ప్రియాంశ్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నారని.. వారి ఆట తీరు జట్టుకు మంచి రిథమ్ అందిస్తోందన శ్రేయస్ అయ్యర్ ప్రశంసల వర్షం కురిపించాడు. జట్టులో ప్రతి ఒక్కరికీ బ్యాటింగ్ చేసే అవకాశం రావడం శుభపరిణామమని.. ఇది ఒత్తిడి సమయాల్లో ఆటగాళ్లకు ఎలా స్పందించాలో నేర్పిస్తూ జట్టులో అపారమైన ఆత్మవిశ్వాసాన్ని నింపుతుందని శ్రేయస్ వెల్లడించాడు.
డ్రెస్సింగ్ రూమ్ సీక్రెట్ చెప్పేసిన శ్రేయస్ అయ్యర్!
డ్రెస్సింగ్ రూమ్‌లో తాము తీసుకున్న ఓ నిర్ణయం గురించి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఒకరిని ఒకరు మెప్పించే విధంగా అత్యుత్తమ క్రికెట్ ఆడాలని తాము నిర్ణయించుకున్నామని.. ఇది తమ ఆటలో స్పష్టతను ఇవ్వడమే కాకుండా ఒకరికొకరు సవాలు విసురుకుంటూ రాటుదేలేలా చేస్తోందని వివరించాడు. ముఖ్యంగా 11 బంతుల్లోనే 39 పరుగులు రాబట్టడం వంటి మెరుపు ఆరంభాలే తమ జట్టుకు అవసరమని అయ్యర్ అభిప్రాయపడ్డాడు.

స్లో ఓవర్ రేట్ టెన్షన్
బౌలింగ్ విభాగం గురించి శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌పై తొలి 3 ఓవర్లలో కేవలం 25 పరుగులు మాత్రమే ఇవ్వడం గొప్ప విషయమని, బౌలర్లు ప్రశాంతంగా ఉండటం చాలా ముఖ్యమని శ్రేయస్ అయ్యర్ పేర్కొన్నాడు. అయితే, స్లో ఓవర్ రేట్ విషయంలో మాత్రం తాము మెరుగుపడాల్సి ఉందని, భవిష్యత్తులో ఈ అంశంపైనే తాము ప్రధానంగా దృష్టి సారించాల్సి ఉంటుందని ఆయన నిజాయితీగా అంగీకరించాడు.
స్పిన్నర్ చాహల్‌కు కోటా ఎందుకు పూర్తి చేయించలేదు?
యుజ్వేంద్ర చాహల్‌తో కోటా పూర్తి చేయించకపోవడంపై కూడా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వివరణ ఇచ్చాడు. అప్పటికి క్రీజులో ఉన్న బ్యాటర్ల సరళిని బట్టి సీమర్లతో బౌలింగ్ చేయించాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశాడు. చాహల్ ఎంతటి అద్భుతమైన బౌలరో మనందరికీ తెలుసని.. మైదానంలో తనకు ఎప్పుడు అనుమానం వచ్చినా లేదా ఇబ్బంది ఎదురైనా వెంటనే చాహల్ దగ్గరికే వెళ్తానని శ్రేయస్ అయ్యర్ తన నమ్మకాన్ని వ్యక్తం చేశాడు.