
హైదరాబాద్: బుకీల రూపంలో ఉన్న విలేకరులతో మాట్లాడినందుకు ఐసీసీ నిషేదాన్ని జారీ చేసింది. కానీ, అందులో అంతరంగాన్ని బయటపెడితే తనకు ఆ శిక్ష పడేది కాదని నిషేదం ముగిసిపోతోన్న సమయంలో బయటపెడుతున్నాడు క్యురేటర్ పాండురంగ్ సాల్గోంకర్. గతేడాది అక్టోబరు 25న పుణెలో భారత్-న్యూజిలాండ్ వన్డే మ్యాచ్‌కు ముందు బుకీల రూపంలో ఉన్న విలేకరులతో పిచ్ సమాచారం పంచుకున్న క్యురేటర్ సాల్గోంకర్‌పై ఐసీసీ ఆరు నెలల సస్పెన్షన్ వేటు వేసింది.
మ్యాచ్ రోజుతో మొదలై ఏప్రిల్ 25తో అతడి సస్పెన్షన్ ముగుస్తుందని ఐసీసీ ప్రకటించింది. మ్యాచ్‌ను ఫిక్స్ చేసేందుకు సాల్గోంకర్ ప్రయత్నించినట్లు ఆధారాలు లేవని, అతను నేరం చేయలేదని నిర్ధరించిన ఐసీసీ.. బుకీల రూపంలో వచ్చిన విలేకరులు తనను పిచ్ సమాచారం అడిగిన విషయాన్ని నివేదించకపోవడాన్ని తప్పిదంగా పేర్కొంది.
ఈ తప్పిదం కిందే అతడిపై సస్పెన్షన్ విధించింది. ఐసీసీ తీర్పును తాను అనుసరిస్తానని సాల్గోంకర్ అన్నాడు. ''ప్రచార యావతో, జనాల దృష్టిని ఆకర్షించేందుకే నాపై ఈ ఆరోపణలు చేశారు. 50 సంవత్సరాలుగా క్రికెట్‌లో ఉన్నా. ఐసీసీ తీర్పును అంగీకరిస్తున్నా. నేను అవినీతి నిరోధక విభాగానికి ఆ రోజు జరిగింది నివేదించాల్సింది. ఐతే నా భార్య ఆ రోజు ఆసుపత్రిలో చేరింది. నేనా బాధలో ఉండి సమాచారం ఇవ్వలేకపోయాను. కానీ, ఐసీసీ ప్రత్యేక విచారణ జరిపించి నిజాన్ని అందరిముందు ఉంచినందుకు ధన్యవాదాలు' అని తెలిపాడు.
ఈ ఘటన గురించి అతని కుమార్తె స్పందిస్తూ.. 'ఆర్నెళ్ల నుంచి టీవి ఛానెల్ చూద్దామంటే భయమేస్తోంది. ఆ ఘటన పట్ల మా నాన్నను పదేపదే అవినీతికి పాల్పడిన వాడంటూ చూపిస్తుంటే అమ్మ తట్టుకోలేకపోయేది. ఇప్పుడు కాస్తంత ప్రశాంతంగా ఉంది. ఇంకొద్ది రోజుల్లో ఆయన మళ్లీ సర్వీసులోకి వస్తారని ఆశిస్తున్నా' అంటూ ముగించింది.