పూణె పిచ్ ఫిక్సింగ్: ఎవరీ క్యూరేటర్ పాండురంగ సల్గొంకర్
హైదరాబాద్: మరికొన్ని గంటల్లో పూణె వేదికగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో వన్డే జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పిచ్ క్యూరేటర్ పాండురంగ సల్గొంకర్ ఇండియా టుడే న్యూస్ ఛానెల్ జరిపిన స్టింగ్ ఆపరేషన్‌లో అడ్డంగా దొరికిపోయాడు. తాము బుకీలమంటూ తన దగ్గరికి వచ్చిన రిపోర్టర్లకు పిచ్ రిపోర్ట్ మొత్తం అందజేశాడు.
దీంతో ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన బీసీసీఐ, మహారాష్ట్ర క్రికెట్ ఆసోసియేషన్ (ఎమ్‌సీఏ) పాండురంగపై వెంటనే చర్యలకు ఉపక్రమించింది. అతడిపై సస్పెన్షన్ వేటు వేసింది. దీంతో రెండో వన్డేపై నీలినీడలు అలముకున్న నేపథ్యంలో బీసీసీఐ అధికారులు స్పందించారు. ఈ స్టింగ్ ఆపరేషన్‌కు మ్యాచ్‌కి సంబంధం లేదని, నేటి మ్యాచ్ యధావిధిగా జరుగుతుందని స్పష్టం చేశారు.
మరోవైపు మ్యాచ్ రద్దు చేస్తారంటూ వచ్చిన వార్తలు పూర్తి నిరాధారమైన పుకారేనని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ కూడా వెల్లడించింది. న్యూట్రల్ పిచ్ క్యూరేటర్ ఒకరు పిచ్‌ను పరిశీలించి మ్యాచ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు బీసీసీఐ వెల్లడించింది. విచారణ పూర్తయ్యే వరకు పాండురంగ గ్రౌండ్‌లో అడుగుపెట్టకుండా బోర్డు నిషేధం విధించింది.
ఐసీసీ కూడా ఈ మ్యాచ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో క్రికెట్ అభిమానుల్లో ఎవరీ క్యూరేటర్ పాండురంగ సల్గొంకర్ అనే ప్రశ్న ఉదయించింది. మహారాష్ట్రకు చెందిన పాండురంగ సల్గొంకర్ 1971-82 మధ్య కాలంలో 63 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, 5 లిస్ట్-ఏ గేమ్‌లు ఆడాడు. ఫాస్ట్ బౌలర్ అయిన పాండురంగ ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 214 వికెట్లు, లిస్ట్-ఏ మ్యాచ్‌ల్లో 4 వికెట్లు తీశాడు. గవాస్కర్ తన ఆటోబయోగ్రఫీ 'సన్నీ డేస్'లో సాల్గోంకర్ గురించి ప్రస్తావించాడు. అతను నాణ్యమైన ఫాస్ట్‌బౌలర్ అని, దురదృష్టవశాత్తూ అతడికి భారత జట్టులో అవకాశం దక్కలేదని పేర్కొన్నాడు. క్రికెట్ కెరీర్ ముగిశాక అతను క్యురేటర్‌గా స్థిరపడ్డాడు.
అసలేం జరిగింది?
నిజానికి బయటి వ్యక్తులకు పిచ్ దగ్గరికి వెళ్లే అనుమతి ఉండదు. కానీ పాండురంగ బీసీసీఐ, ఐసీసీ నిబంధనలకు విరుద్ధంగా రిపోర్టర్లను క్యూరేటర్ పిచ్ వద్దకు తీసుకెళ్లాడు. క్రికెట్ బుకీల రూపంలో వచ్చిన రిపోర్టర్లతో పిచ్ క్యూరేటర్ మాట్లాడుతూ 'ఒకరిద్దరు ఆటగాళ్లు బౌన్సీ పిచ్ కావాలని కోరుతున్నారని, అది జరుగుతుందా?' అని అడగ్గా 'సరే, పిచ్ ను అలాగే మారుస్తా' అంటూ సమాధానమిచ్చాడు. అంతేకాదు పిచ్‌ను బ్యాటింగ్‌కు సహకరించేలా పిచ్‌ను తయారుచేస్తానని 337 నుంచి 340 పరుగుల చేసే అవకాశం ఉందని చెప్పి స్టింగ్ ఆపరేషన్‌లో దొరికిపోయాడు.

ఈ ఘటనపై స్పందించిన బీసీసీఐ
బీసీసీఐ తరఫు ప్రతినిధి కూడా ఇక్కడే ఉన్నాడు అని పాండురంగ చెప్పాడు. ఐసీసీ లేదా బీసీసీఐ అడిగితే పిచ్ దగ్గరికి ఎవరూ రాలేరని చెబుతాను అని అతను అన్నాడు. ఇదే సమయంలో మరికొందరు పిచ్‌పై అటూ ఇటూ నడవడం కూడా ఈ స్టింగ్ ఆపరేషన్ వీడియోలో కనిపిస్తుంది. ఈ ఘటనపై బీసీసీఐ స్పందించింది.

కఠిన చర్యలు తీసుకుంటాం
కఠిన చర్యలు తప్పకుండా తీసుకుంటామని బీసీసీఐ తాత్కాలిక కార్యదర్శి అమితాబ్ చౌదరి స్పష్టంచేశారు. 'దీనికి ఎవరు బాధ్యులైనా సరైన దిశలో చర్యలు తీసుకుంటాం. ఇలాంటి విషయాలను బీసీసీఐ అసలు సహించదు' అని ఆయన అన్నారు. మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్‌తో కూడా ఈ విషయంపై మాట్లాడినట్లు అమితాబ్ చౌదరి చెప్పారు.
గతంలో పాండురంగ మంచి ఫస్ట్‌క్లాస్ క్రికెటర్
పాండురంగ గతంలో మంచి ఫస్ట్‌క్లాస్ క్రికెటర్ అని, అతను ఇలా చేయడం నమ్మలేకపోతున్నానని ఆయన అన్నారు. ఇక, సుప్రీంకోర్టు నియమించిన కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ కూడా పిచ్ ఫిక్సింగ్ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది. ఈ మొత్తం ఘటనపై విచారణ జరపనున్నామని, బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని సీఓఏ చీఫ్ వినోద్ రాయ్ హెచ్చరించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications