
హైదరాబాద్: విశాఖ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా ఆటగాడు ఛటేశ్వర్ పుజారాపై ఓపెనర్ రోహిత్ శర్మ నోరు జారాడు. ఓవర్‌నైట్ స్కోరు 385/8తో నాలుగో రోజైన శనివారం ఆటను ప్రారంభించిన దక్షిణాఫ్రికా మరో 46 పరుగులు జోడించి 431 పరుగుల వద్ద ఆలౌటైంది.
అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన భారత జట్టులో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ రెండో ఇన్నింగ్స్‌లో ఏడు పరుగులకే ఔటయ్యాడు. కేశవ్ మహారాజ్ బౌలింగ్‌లో స్లిప్‌లో డుప్లెసిస్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన పుజారాతో కలిసి రోహిత్ శర్మ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు.
వీరిద్దరూ కలిసి రెండో వికెట్‌కు 183 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే, ఒకానొక దశలో రోహిత్ శర్మ సింగిల్ తీసేందుకు ప్రయత్నించిన సమయంలో అవతలివైపు ఉన్న పుజారా నుంచి ఎటువంటి స్పందన రాకపోడవంతో రోహిత్ శర్మ నోటికి పని చెప్పాడు. పుజారాను బూతులు తిట్టాడు.
రోహిత్ శర్మ అన్న మాటలు స్టంప్ మైక్లో రికార్డు అయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. "పుజారా ఫాస్ట్‌గా పరుగులు చేయాలంటే... రోహిత్ శర్మకు కోహ్లీ ఇచ్చే సలహా" ఇదేనంటూ ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. "పరుగు తీయకపోవడంతో పుజారాపై నిప్పులు చెరిగిన రోహిత్ శర్మ" అంటూ మరొక నెటిజన్ కామెంట్ పెట్టాడు.
ఇదిలా ఉంటే, నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా 9 ఓవర్లకు గాను వికెట్ నష్టానికి 11 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో ఐడెన్ మార్‌క్రమ్(3), డి బ్రుయిన్(5) పరుగులతో ఉన్నారు. ఈ టెస్టులో దక్షిణాఫ్రికా విజయం సాధించాలంటే 384 పరుగులు చేయాలి... అలా కాకుండా టీమిండియా విజయం సాధించాలంటే ఆఖరి రోజైన ఆదివారం 9వికెట్లు పడగొట్టాలి.