ఇంగ్లండ్‌తో చివరి మూడు టెస్టులకు భారత జట్టును బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. వ్యక్తిగత కారణాలతో విరాట్ కోహ్లి, గాయంతో శ్రేయస్ అయ్యర్ జట్టుకు దూరమయ్యారు. కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజాను జట్టులోకి తీసుకున్నప్పటికీ వాళ్లు ఫిట్‌నెస్‌లో క్లియరెన్స్ పొందాల్సి ఉంది. సర్ఫరాజ్ ఖాన్, రజత్ పటిదార్ జట్టులో తమ స్థానాలను నిలబెట్టుకున్నారు.
అయితే టీమిండియా సెలక్టర్లపై నెట్టింట్లో విమర్శలు వస్తున్నాయి. సీనియర్ చెతేశ్వర్ పుజారాను ఎంపిక చేయకపోవడానికి గల కారణాలు వివరించాలని డిమాండ్ చేస్తున్నారు. యువకులకు జట్టులో పెద్దపీట వేయాలని ఫామ్‌లో ఉన్న ప్లేయర్‌ను పక్కనపెట్టడం తప్పని పోస్టులు పెడుతున్నారు. పుజారా ఇంకెన్ని శతకాలు సాధించాలని, అతడు చేసిన తప్పేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

36 ఏళ్ల పుజారా టీమిండియాకు దూరమై దాదాపు ఎనిమిది నెలలు దాటింది. గతేడాది జరిగిన వరల్ట్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో చివరిగా ఆడాడు. ఆ తర్వాత అతడిని పక్కనపెట్టారు. శుభ్‌మన్ గిల్‌కు మూడో స్థానంలో అవకాశం ఇచ్చారు. ఓపెనర్‌గా సత్తాచాటిన గిల్ వన్‌డౌన్‌లో విఫలమయ్యాడు. మొత్తంగా లయ అందుకుని వైజాగ్ టెస్టులో సెంచరీ సాధించాడు.
మరోవైపు పుజారా టీమిండియాలో తిరిగి చోటు సంపాదించాలని రంజీ ట్రోఫీలో కసిగా పరుగులు సాధిస్తున్నాడు. రంజీ ట్రోఫీలో సౌరాష్ట్ర తరఫున ఆడుతున్న పుజారా సెంచరీల మోత మోగిస్తున్నాడు. రాజస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శుక్రవారం కూడా 110 పరుగులు సాధించాడు. అంతేగాక ఈ సీజన్‌లో పుజారా డబుల్ సెంచరీ బాదాడు. 243 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
హర్యానా జట్టుపై 49, 43 పరుగులు, విదర్భపై 43, 66 పరుగులు చేశాడు. సర్విసెస్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 91 పరుగులు చేసి తృటిలో సెంచరీని చేజార్చుకున్నాడు. ఇలా పరుగుల వరద పారిస్తూ భారత జట్టులో చోటు దక్కించుకోవడానికి అర్హుడినేని బ్యాటుతో చాటి చెప్పాడు. కానీ సెలక్టర్లు యువ ప్లేయర్లకు అవకాశం ఇవ్వాలని పుజారాకు మొండిచేయి చూపడం గమనార్హం. కాగా, పుజారా 103 టెస్టుల్లో 43 సగటుతో 7195 పరుగులు చేశాడు. 19 సెంచరీలు, మూడు డబుల్ సెంచరీలు సాధించాడు.