
హైదరాబాద్: శ్రీలంకతో బుధవారం ముగిసిన మూడో టెస్టులో టీమిండియా పేలవమైన ఫీల్డింగ్ చేసిందని మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ ఛటేశ్వర్ పుజారా అన్నాడు. మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన పూజారా 'స్లిప్ ప్రదేశంలో ఫీల్డింగ్ చేసిన శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఈజీ క్యాచ్‌లను నేలపాలు చేశారు' అని పూజారా అన్నాడు.
'నిజాయతీగా చెప్పాలంటే ప్రమాణాలకి తగినట్లుగా ఫిరోజ్ షా కోట్ల మైదానంలో భారత్ జట్టు ఫీల్డింగ్ లేదు. స్లిప్‌లో మెరుగ్గా ఫీల్డింగ్ చేసే మురళీ విజయ్ ఇటీవలే గాయం నుంచి కోలుకుని పునరాగమనం చేయడంతో అతని స్థానంలో వేరొకరు అక్కడ ఫీల్డింగ్ చేయాల్సి వచ్చింది' అని పుజారా తెలిపాడు.
'దీంతో క్యాచ్‌లు అందుకోవడంలో కొన్ని తప్పిదాలు జరిగాయి. తరచూ అక్కడ క్యాచ్‌లు మిస్ అవడంపై కచ్చితమైన కారణం అడిగితే చెప్పడం కష్టం. కానీ.. ఫీల్డింగ్‌లో జట్టు ఇంకా మెరుగవ్వాల్సి ఉంది. ముఖ్యంగా స్లిప్ ఫీల్డింగ్‌లో' అని పుజారా పేర్కొన్నాడు.
'స్లిప్స్‌లో ఉన్న ఆటగాళ్లు గతంలో అనేక క్యాచ్‌లు అందుకున్నారు. రాబోయే రోజుల్లో దీనిపై మరింతగా శ్రమిస్తామని, తద్వారా మంచి ఫలితాలను సాధిస్తాం' అని పుజారా వివరించాడు. క్యాచ్‌ల కారణంగానే లంక జట్టు చివరి టెస్టు చివరి రోజైన బుధవారం పుంజుకుని ఓటమి దశ నుంచి తప్పించుకుని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.